సిటీలోని గోడౌన్లపై నిర్లక్ష్యంగా బల్దియా

సిటీలోని గోడౌన్లపై నిర్లక్ష్యంగా బల్దియా
  • లెక్కల్లేవ్.. తనిఖీలుండవ్​!
  • సిటీలోని గోడౌన్లపై నిర్లక్ష్యంగా బల్దియా  
  • బోయిగూడలో జరిగిన ఘటనే సాక్ష్యం 
  • గ్రేటర్ లో  లక్షా 60 వేల ట్రేడ్ లైసెన్స్ లు
  •  మరో 2 లక్షలు అక్రమంగానే..!


హైదరాబాద్‌,వెలుగు: సిటీలో అక్రమంగా కొనసాగుతున్న గోడౌన్లు, కంపెనీలు కార్మికుల ప్రాణాలు తీస్తున్నాయి. అగ్ని ప్రమాదాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణంగా ఉంటోంది.  సికింద్రాబాద్‌ బోయిగూడలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదమే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. స్క్రాప్‌ గోడౌన్​లో అగ్ని  ప్రమాదంలో 11 మంది బిహార్‌ ‌కార్మికులు చనిపోయారు.  గోడౌన్​కు ఎలాంటి అనుమతులు లేకపోవడం, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు గుర్తించారు. ముషీరాబాద్‌, భోలక్‌పూర్, బోయిగూడ పరిసర ప్రాంతాల్లో సుమారు180 కి పైగా స్క్రాప్‌, కెమికల్‌ గోడౌన్లు, టింబర్‌ డిపోలు‌ ఉన్నాయి. వీటిలో  ఫైర్ సేఫ్టీ సహా కార్మికులకు ప్రాణాలకు ఎలాంటి భద్రత చర్యలు లేవు.  ప్రస్తుతం ఫైర్ యాక్సిడెంట్ జరిగిన స్ర్కాప్​ గోడౌన్​కు  లైసెన్స్ జారీ చేశారా? లేదా అనేది కూడా బల్దియా అధికారులు స్పష్టంగా చెప్పడంలేదు. అసిస్టెంట్ లైసెన్స్ నుంచి కమిషనర్ వరకు  ఫోన్ చేసినా స్పందన లేదు. డీసీ మాత్రమే స్పందించినా ఆయన కూడా పూర్తి సమాచారం ఇవ్వలేదు.  సికింద్రాబాద్ సర్కిల్​లో 30 వేల లైసెన్స్ లు జారీ చేశామని, అందులో ఈ  స్ర్కాప్​ గోడౌన్​ ఉందో లేదో రికార్డులు చూసి చెబుతామని సమాధానం ఇచ్చారు. 

ప్రమాదాలు జరిగినప్పుడే తనిఖీలు చేసుంటే..
సిటీలో గోడౌన్లు ఎన్ని ఉన్నాయో సర్వే చేస్తామన్నారంటే ఎలాంటి వివరాలు లేవని తెలుస్తోంది. బోయిగూడ అగ్ని  ప్రమాదానికి బల్దియా నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ట్రేడ్  లైసెన్స్ లు జారీ చేసేటప్పుడు  ఎలాంటి తనిఖీలు చేయకుండానే జారీ చేస్తుండగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలోనూ ఈ గోడౌన్ ​పక్కనే ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే పూర్తిస్థాయిలో చర్యలు తీసుకొని ఉంటే ఇది జరిగి ఉండకపోయేది. కొంతకాలంగా ఈ – లైసెన్స్ ల జారీ ప్రక్రియ ఆన్ లైన్ చేయడంతో అధికారులు ఆఫీసుల్లో కూర్చోనే  అనుమతులు ఇచ్చేస్తున్నారు.  గ్రేటర్ పరిధిలో ఒక లక్షా 60 వేల ట్రేడ్ లైసెన్స్ లను మాత్రమే బల్దియా జారీ చేసింది. లైసెన్స్ లు లేకుండా మరో 2 లక్షల వరకు కొనసాగుతున్నాయి. ఇప్పటి కైనా ఇలాంటి  సంఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. 

ఎన్ని గోడౌన్లు ఉన్నయో తెలియదు: మేయర్​
బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విచారణ వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. కూలీలు మరణించడం బాధకరమని, భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు  జరగకుండా చర్యలు తీసుకుంటామని మేయర్​ తెలిపారు. ఇలాంటివి సిటీలో ఎన్ని గోడౌన్లు ఉన్నయో కూడా తెలియదని, సమాచారం లేదని చెప్పారు. అనంతరం గాంధీ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్న  కార్మికుడిని మేయర్​పరామర్శించారు. 

​ ఫైర్ సేఫ్టీ రూల్స్ ​పాటించలే: సీపీ
ప్రమాదం జరిగిన స్క్రాప్ గోడౌన్​ ఓనర్ ​ఫైర్ సేఫ్టీ రూల్స్ ​పాటించలేదని సిటీ సీపీ ఆనంద్ తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన ఆయన మాట్లాడుతూ సుధాకర్ రెడ్డికి చెందిన గోడౌన్​ను సంపత్ కుమార్ లీజుకు తీసుకుని కొంత కాలంగా స్క్రాప్​ బిజినెస్​ చేస్తున్నట్లు చెప్పారు.  ప్రమాద ఘటనపై ముందుగా గ్యాస్ సిలిండర్ పేలినట్లు 100 కు ఫోన్ కాల్ వచ్చిందన్నారు. సంపత్ కుమార్ పై కేసు ఫైల్​  చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.