అల్లు కుటుంబానికి మరో షాక్.. పెంట్ హౌస్ కూల్చేస్తామని GHMC నోటీసులు

అల్లు కుటుంబానికి మరో షాక్.. పెంట్ హౌస్ కూల్చేస్తామని GHMC నోటీసులు

హైదరాబాద్: అల్లు కుటుంబానికి షాకిచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లోని అల్లు బిజినెస్‌ పార్క్‌ భవనంపై అక్రమ నిర్మాణం చేపట్టారంటూ హీరో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్‎కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు.

 పర్మిషన్ తీసుకున్నా దానికంటే ఒక ఫ్లోర్ ఎక్కువ కట్టారని.. అక్రమంగా నిర్మించిన ఆ పెంట్‌హౌస్‌ను ఎందుకు కూల్చవద్దో సమాధానం చెప్పాలంటూ జీహెచ్‌ఎంసీ 18వ సర్కిల్‌ అధికారులు వివరణ కోరారు. ఇటీవలే తల్లి చనిపోయినా బాధలో ఉన్న అల్లు అరవింద్‏కు జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఊహించి షాక్ తగిలినట్లైంది. 

దివంగత నటుడు, అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా 2023లో జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో అల్లు బిజినెస్‌ పార్క్‌ పేరుతో భవన నిర్మాణం చేపట్టింది అల్లు ఫ్యామిలీ. నాలుగంతస్తుల భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకొని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసింది అల్లు కుటుంబం.

ఈ అల్లు బిజినెస్‌ పార్క్‌‎లో గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ కుటుంబ వ్యాపారాలు, సినీ కార్యకలాపాలు నడుస్తుంటాయి. ఇటీవల అల్లు బిజినెస్‌ పార్క్‌‎ భవనంలో పెంట్ హౌజ్ నిర్మించారు. అయితే, ఆ పెంట్ హౌస్ నిర్మాణం అక్రమమని.. పెంట్ హౌస్‎ను ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. 

ఓ ఈవెంట్లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి విమర్శల పాలుకావడం, ఆ తర్వాత సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడం.. ఇటీవల అల్లు అరవింద్ తల్లి అల్లు కనకమ్మ మృతి చెందటం.. ఈ బాధ నుంచి తేరుకోకముందే జీహెచ్ఎంసీ అధికారులు అల్లు అరవింద్‎కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం.. ఇలా వరుసగా అల్లు ఫ్యామిలీలో ఏదో ఒక గందరగోళం పరిస్థితులు తలెత్తున్నాయి.