- నెలలో సెటిల్ చేస్తామని కేర్ టేకర్ హామీ ఇవ్వడంతో అన్ సీజ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితకు చెందిన భవనంపై ఉన్న సీజ్‌ను యూసుఫ్‌గూడ సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం ఎత్తివేశారు. గడిచిన పదేండ్లుగా రూ.1.59 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో బిల్డింగ్‌ని అధికారులు సోమవారం సీజ్ చేశారు.
ఇందులో రూ.78 లక్షలు ప్రిన్సిపల్ అమౌంట్ కాగా, రూ.81 లక్షలు వడ్డీ ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి. రెసిడెన్షియల్ భవనం అయినప్పటికీ గతంలో ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఈ భవనాన్ని అద్దెకు తీసుకుని కమర్షియల్‌గా వినియోగించారు. దీంతో అధికారులు కమర్షియల్ పన్ను వేశారు. ఈ మేరకు అక్కడ ఉంటున్న కేర్ టేకర్‌కి నోటీసులిచ్చారు.
స్పందించిన కేర్ టేకర్.. గత కొన్నేండ్లుగా ఈ భవనం ఖాళీగా ఉంటుందని, ఖాళీగా ఉన్న సమయంలో వేసిన పన్నులో రాయితీ ఇవ్వాలని కోరారు. నెల రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతో బిల్డింగ్‌పై సీజ్‌ను ఎత్తివేశారు.
కాగా, ఈ వార్త వైరల్ కావడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పందించారు. రెసిడెన్షియల్ భవనాలను సీజ్ చేయొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ ఎందుకు చేశారని ప్రశ్నలు రావడంతో, వెంటనే ఆ బిల్డింగ్‌ను అన్ సీజ్ చేయించినట్లు తెలిసింది. గతంలో విజయ్ మాల్యా కమర్షియల్‌గా వినియోగించినట్లు, ఆయన ఖాళీ చేశాక ఈ భవనాన్ని కమర్షియల్ నుంచి రెసిడెన్షియల్‌కు మార్చాలని కోరుతూ జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నా, అధికారులు ఇప్పటివరకు చేయలేదని సమాచారం.
