హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లను అధికారులు వేగవంతం చేశారు. మూడు కార్పొరేషన్లుగా విభజించకముందు రూ. 2,200 కోట్లుగా ఉన్న జీహెచ్ఎంసీ టార్గెట్ను, 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం తర్వాత రూ. 3 వేల కోట్లకు పెంచారు. ఈ నెల 11 వరకు జరిగిన వసూళ్ల గణాంకాలను పరిశీలిస్తే, మొత్తం రూ. 1,995 కోట్లు ఖజానాకు చేరింది. ఇందులో అత్యధికంగా సైబరాబాద్ నుంచి రూ. 812 కోట్లు రాగా, జీహెచ్‌ఎంసీ నుంచి రూ. 748.9 కోట్లు, మల్కాజిగిరి నుంచి రూ. 433.1 కోట్లు వసూలైంది.
విలీనం తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నంబర్ల (పీటీఐఎన్) సంఖ్య 19.5 లక్షల నుంచి 23 లక్షలకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నెలాఖరు నాటికి మరో రూ. 1,005 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.
కాగా, మొండి బకాయిల కోసం ప్రవేశపెట్టిన వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) ద్వారా 90 శాతం వడ్డీ మాఫీ పథకం ప్రస్తుతం మూడు కార్పొరేషన్లలోనూ కొనసాగుతోందని, సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
