బస్సుతో ఢీ కొట్టి, అర కి.మీ. ఈడ్చుకెళ్లి.. ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి

బస్సుతో ఢీ కొట్టి, అర కి.మీ. ఈడ్చుకెళ్లి.. ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి
  •     ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి
  •     మృతుడు రాంకీ డంపింగ్​ యార్డులో సర్కిల్​ ఇన్​చార్జి 
  •     న్యాయం చేయాలని బంధువుల ఆందోళన

 జీడిమెట్ల, వెలుగు: సిటీలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలైంది. జీడిమెట్లలోని గాజులరామారంలో డ్యూటీకి వెళ్తున్న వ్యక్తిని బస్సు ఢీ కొట్టి, దాదాపు అర కిలోమీటర్​మేర ఈడ్చుకెళ్లింది. సీఐ గడ్డం మల్లేశ్ వివరాల ప్రకారం.. యాప్రాల్​లోని గోల్ఫ్​ఫ్రైడ్ ​హోమ్​లో నివాసం ఉంటున్న హరికృష్ణ (44) ఆర్మీలో పనిచేసి రిటైరయ్యాడు. గత నాలుగేళ్లుగా పైప్​లైన్​రోడ్డులోని రాంకీ డంపింగ్​యార్డులో సర్కిల్​ఇన్​చార్జిగా​పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం 5.30 గంటలకు బైక్​పై ఇంటి నుంచి డ్యూటీకి బయలుదేరాడు. 

ఈ క్రమంలో గాజులరామారం సర్కిల్ వద్ద ఆర్.కె ట్రావెల్స్​కు చెందిన బస్సు అతివేగంగా వచ్చి అతడిని వెనక నుంచి ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా దాదాపు అర కి.మీ. దూరం వరకూ ఈడ్చుకుంటూ వెళ్లడంతో హరికృష్ణ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉండగా, ​బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ తోటి జీహెచ్ఎంసీ ఉద్యోగులు, బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఆర్.కె ట్రావెల్స్ ​యాజమాన్యం నిర్లక్ష్యంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ బస్సులపై నిఘా పెట్టాలన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారికి  నచ్చచెప్పి, డెడ్​బాడీని గాంధీ హాస్పిటల్​కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.