- ఆర్బీఎస్కే 2.0 గైడ్లైన్స్ విడుదల చేసిన కేంద్రం
- పిల్లల్లో పెరుగుతున్న టైప్-1, టైప్-2 డయాబెటిస్
- 4Ts లక్షణాలుంటే అలెర్ట్ అవ్వాల్సిందేనని సూచన
- జిల్లా హాస్పిటల్స్ లో ఫ్రీగా ఇన్సులిన్, గ్లూకోమీటర్లు, స్ట్రిప్స్
హైదరాబాద్, వెలుగు: దేశంలో చిన్నారుల్లో డయాబెటిక్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) కింద పిల్లల్లో డయాబెటిస్ టెస్టులు చేయాలని నిర్ణయించింది. గుర్తింపు, నిర్వహణ కోసం ఆర్బీఎస్కే 2.0 పేరుతో కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఇకపై స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లలోనే చిన్నారులకు షుగర్ టెస్టులు చేయాలని ఆదేశించింది. ఆర్బీఎస్కే మొబైల్ హెల్త్ టీమ్స్ (ఎంహెచ్టీ) స్కూల్ విజిట్ కు వెళ్లినప్పుడు ఈ 4Ts లక్షణాలున్న పిల్లలను గుర్తిస్తారు. వెంటనే గ్లూకోమీటర్ సాయంతో రక్త పరీక్ష చేస్తారు. షుగర్ లెవల్స్ 200 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువ ఉంటే వెంటనే జిల్లా హాస్పిటల్ లోని ఎన్సీడీ క్లినిక్ కు పంపిస్తారు. అక్కడ పీడియాట్రిషియన్లు మరిన్ని పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారిస్తారు. ఒకవేళ చిన్నారులకు షుగర్ ముప్పు ఉంటే (ప్రె-డయాబెటిస్), వారికి ఏటా స్క్రీనింగ్ చేయాలని గైడ్లైన్స్ చెబుతున్నాయి. త్వరలోనే మన రాష్ట్రంలో కూడా ఆర్బీఎస్కే ద్వారా టెస్టులు, చికిత్స నిర్వహణ జరిగే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
లక్షణాల గుర్తింపునకు 4Ts ఫార్ములా...
పిల్లల్లో టైప్-1 డయాబెటిస్ ఉందో లేదో గుర్తించేందుకు డాక్టర్లు 4Ts అనే ఫార్ములాను సూచిస్తున్నారు. పేరెంట్స్, టీచర్లు పిల్లల్లో ఈ మార్పులను గమనించాలంటున్నారు. పిల్లల జీవనశైలిలో మార్పులు రావాలని... ఫైబర్ ఎక్కువగా ఉండే హోమ్ మేడ్ ఫుడ్ పెట్టాలంటున్నారు. చక్కెర పానీయాలు, జంక్ ఫుడ్ స్కూల్ ఆవరణలో లేకుండా చూడాలని, రోజుకు కనీసం 60 నిమిషాల పాటు ఆటలు, యోగా, సైక్లింగ్ ఉండాలని, రోజుకు 8 నుంచి 11 గంటలు నిద్ర కచ్చితంగా ఉండాలని చెబుతున్నారు.
1. టాయిలెట్: బాబు, పాప మాటిమాటికీ యూరిన్ కు వెళ్తున్నారా? రాత్రి పూట పక్క తడుపుతున్నారా?
2. థర్స్టీ: విపరీతంగా దాహం వేస్తోందా? ఎన్ని నీళ్లు తాగినా ఇంకా కావాలంటున్నారా?
3. టైర్డ్: చదువులో వెనుకబడినా, ఆటల్లో త్వరగా అలసిపోయినా, ఎప్పుడూ నీరసంగా ఉంటున్నారా?
4. థిన్నర్: తిండి బాగా తింటున్నా.. అకస్మాత్తుగా బరువు తగ్గిపోతున్నారా? ఈ లక్షణాలు ఉంటే షుగర్ టెస్టులు చేయించాల్సిందేనని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఫ్రీగా... ఇన్సులిన్, గ్లూకోమీటర్..
టైప్-1 షుగర్ ఉన్న వారికి ఇన్సులిన్ ప్రాణాధారం. అందుకే జిల్లా హాస్పిటల్స్ ద్వారా వీరికి ప్రతి నెలా అవసరమైన ఇన్సులిన్ ఇంజెక్షన్లు, సిరంజీలను ఉచితంగా ఇస్తారు. అంతేకాకుండా, ఇంట్లోనే షుగర్ చెక్ చేసుకోవడానికి గ్లూకోమీటర్, నెలకు సరిపడా టెస్ట్ స్ట్రిప్స్, లాన్సెట్లను కూడా ఫ్రీగా అందజేస్తారు. చికిత్సకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ పోర్టల్స్ లో అప్లోడ్ చేస్తారు. ఒకవేళ షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోతే.. పిల్లలు స్పృహ తప్పే ప్రమాదం ఉంది. అలాంటి సమయంలో తేనె, గ్లూకోజ్ టాబ్లెట్లు వాడాలని, ఒకవేళ పరిస్థితి విషమిస్తే వెంటనే అంబులెన్స్ సాయంతో హాస్పిటల్ కు తరలించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
