న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్)ను గెలిపించినందుకు ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై సోమవారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మాపై నమ్మకం ఉంచి, అఖండ మద్దతును అందించినందుకు కేరళ ప్రజలకు థ్యాంక్స్. మీరు మాపై ఉంచిన ఈ నమ్మకమే యూడీఎఫ్‌కు మార్గదర్శక శక్తిగా నిలుస్తుంది. వచ్చే ఐదేండ్లలో ప్రతిరోజూ మా కృతజ్ఞతను చాటుకుంటూ.. మీకు ఇచ్చిన హామీలను నిజాయితీతో, వినమ్రతతో నెరవేర్చడానికి ప్రయత్నిస్తాం’ అని ప్రియాంక తెలిపారు.
ఇక వాయనాడ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘వయనాడ్ కుటుంబ సభ్యులారా.. యూడీఎఫ్‌పై మీ నమ్మకాన్ని మరోసారి చాటుతూ ఘనవిజయాన్ని అందించారు. అక్కడ ఏడు అసెంబ్లీ స్థానాలకు 7 సీట్లను గెలిపించారు!! ఇప్పుడు వయనాడ్ అభివృద్ధి కోసం 8 మంది ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయబోతున్నారు (ఎంపీతో కలిపి). మీ అంచనాలను అందుకోవడానికి మేం చేయగలిగినదంతా చేస్తాం" అని ప్రియాంక పేర్కొన్నారు.
