సిరిసిల్ల భూసేకరణ అధికారిపై హైకోర్టు సీరియస్!

సిరిసిల్ల భూసేకరణ అధికారిపై హైకోర్టు సీరియస్!
  • కోర్టుకు హాజరుకావాలన్న ఆదేశాలు అమలు చేయరా అంటూ ఫైర్​

హైదరాబాద్, వెలుగు:  భూసేకరణ అవార్డు మొత్తాన్ని చెల్లించకపోవడంతో పాటు బాధితులు ఇచ్చిన నోటీసులను స్వీకరించడానికి నిరాకరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా భూసేకరణ అధికారి (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్)పై హైకోర్టు  సీరియస్​అయ్యింది. సోమవారం కేసు విచారణకు రాగా, వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలన్న గత ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ఉప ముఖ్యమంత్రితో సమావేశం ఉన్నందున మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మెమో దాఖలు చేయగా, దీనిపై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌‌కుమార్ నిరాకరించారు.

 ఈనెల 6న సదరు అధికారి కచ్చితంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన జోగినపల్లి మంగమ్మతోపాటు మరో ఇద్దరి భూమిని ప్రభుత్వం సేకరించింది. దీనికి సంబంధించిన రూ.19.5 లక్షల పరిహారాన్ని 15 శాతం వడ్డీతో కలిపి చెల్లించడంలో అధికారులు జాప్యం చేశారు. దీనిపై బాధితులు పంపిన లీగల్ నోటీసులను కూడా అధికారులు తిరస్కరించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించగా, గత నెల 29న సదరు భూసేకరణ అధికారిని స్వయంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించగా గైర్హాజరయ్యారు.