గ్రేటర్ హైదరాబాద్లో 3 ఫుట్బాల్ స్టేడియాలు

గ్రేటర్ హైదరాబాద్లో 3 ఫుట్బాల్ స్టేడియాలు
  •     సీఎం రేవంత్ ఆదేశాలతో బల్దియా నిర్ణయం
  •     రూ.15 కోట్లతో రెడ్ హిల్స్, కాప్రా, మల్లేపల్లిల్లో ఏర్పాటు
  •     3 నెలల్లో కంప్లీట్ ప్రణాళికలు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  గ్రేటర్ హైదరాబాద్​లో ఫుట్ బాల్ స్టేడియాలు ఏర్పాటు చేయాలని బల్దియా నిర్ణయించింది. సిటీలో ఇప్పటి దాకా ఫుట్ బాల్ స్టేడియం లేకపోవడంతో జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 3 స్టేడియాలకు సంబంధించిన డిజైనింగ్ పై అధికారులు దృష్టి పెట్టారు. కాప్రా, మల్లేపల్లి, రెడ్ హిల్స్ పరిధిలో ఈ 3 స్టేడియాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

మొత్తం రూ.15 కోట్లతో ఈ స్టేడియాలను నిర్మించనున్నారు. కాప్రా సర్కిల్ లోని గెలీలియోనగర్ లో దాదాపు 2.25 ఎకరాల స్థలంలో రూ.6 కోట్ల వ్యయంతో,  ఖైరతాబాద్ జోన్ పరిధిలోని రెడ్ హిల్స్ లో 1.25 ఎకరాల స్థలంలో రూ. 4.90 కోట్లతో, మల్లేపల్లిలోని ఎకరంన్నరలో రూ.4.85 కోట్లతో ఫుట్ బాల్ స్టేడియాలను సిద్ధం చేయబోతున్నారు. 

ఇంటర్నేషనల్​స్టాండర్డ్స్​తో..

ఫుట్​బాల్ స్టేడియాలకు సంబంధించిన ప్రతిపాదనలకు గత నెల 20న స్టాండింగ్ కమిటీ ఆమోదించగా, కౌన్సిల్ కూడా గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. స్టేడియాల కోసం గుర్తించిన ఈ 3 ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్యాలరీ, ఆకర్షణీయమైన లుక్ తో స్టేడియాలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నది. 

రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉండేలా ఈ గ్రౌండ్ లను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలలో వీటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను చేపట్టే అవకాశమున్నట్లు సమాచారం. ముందుగా ఎల్బీ స్టేడియంను ఫుట్ బాల్ స్టేడియంగా మార్చి, ఉప్పల్ స్టేడియాన్ని పర్మినెంట్ గా క్రికెట్ కోసం వినియోగించాలని జీహెచ్ఎంసీ  ప్లాన్ చేసింది. కానీ, అది కుదరకపోవటంతో ఫుట్ బాల్ స్టేడియాల కోసం చాలా స్థలాలను గుర్తించి 3 ప్రాంతాలను ఫైనల్ చేసింది.

3 నెలల్లోనే  పూర్తి చేయాలని టార్గెట్

3 ఫుట్ బాల్ స్టేడియాల నిర్మాణానికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా టెండర్లు వేయాలని అధికారులు నిర్ణయించారు. మూడింటి పనులు 3 నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ స్టేడియాలను నిర్మించేందుకు బల్దియా ఏడాదిన్నర నుంచి కసరత్తు చేస్తున్నది. కానీ, స్థలాలు లభించకపోవడంతో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. 

ఇప్పుడు సీఎం ఆదేశాలతో స్పీడప్ చేశారు. ఎట్టకేలకు నగరంలో ఫుట్ బాల్ స్టేడియాలు క్రీడాకారులకు అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి రానున్నాయి. ఈ స్టేడియాలు ఏర్పాటైతే ఫుట్ బాల్ క్రీడకు క్రేజ్ పెరిగే అవకాశాలున్నాయి.