- 50 రోజుల్లో 36 శాతం పడ్డ బిట్‌కాయిన్ విలువ
- క్రిప్టో స్టాక్స్, క్రిప్టో ఈటీఎఫ్‌ల పరిస్థితి అంతే
- ఈ ఏడాది బంగారం 62 శాతం అప్..
- బిట్‌కాయిన్ కంటే గోల్డ్ బెటర్ అంటున్న ఎనలిస్టులు
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లు గత రెండు నెలలుగా భారీ నష్టాలను చూస్తున్నారు. గత 50 రోజుల్లో రూ.103 లక్షల కోట్లు నష్టపోయారు. బాగా పాపులర్ అయిన బిట్‌కాయిన్ తన ఆల్ టైమ్ హై నుంచి 36 శాతం పడింది. ఈ ఏడాది అక్టోబర్ 6న గరిష్టంగా రూ.1.12 కోట్లకు చేరిన ఈ కరెన్సీ విలువ, నవంబర్ 21న రూ.71.78 లక్షలకు పడిపోయింది.
బిట్‌కాయిన్ పతనంతోనే ఇన్వెస్టర్ల సంపద 700 బిలియన్ డాలర్ల (రూ.62 లక్షల కోట్లు) తగ్గింది. టాప్ 10 క్రిప్టోకరెన్సీలు, బిట్‌కాయిన్ నిల్వ చేసే కంపెనీలు, ఈటీఎఫ్‌లు కూడా ఇన్వెస్టర్లకు విపరీతమైన నష్టాలను మిగిల్చాయి. క్రిప్టో సంబంధిత కంపెనీ అయిన స్ట్రాటజీ ఐఎన్‌సీ షేర్లు కిందటేడాది నవంబర్‌లో ఆల్ టైమ్ గరిష్టాలకి చేరిన తర్వాత నుంచి 67 శాతం పతనమయ్యాయి.
క్రిప్టో స్టాక్స్‌లో పతనం
అమెరికన్ కంపెనీ స్ట్రాటజీ, మెటాప్లానెట్ (జపాన్) వంటి బిట్‌కాయిన్‌ను కొని, హోల్డ్ చేసే కంపెనీల షేర్లు కూడా భారీగా పడుతున్నాయి. స్ట్రాటజీ షేర్లు గత 50 రోజుల్లో 51 శాతం, మెటాప్లానెట్ షేర్లు 35 శాతం క్రాష్ అయ్యాయి. బిట్‌కాయిన్ మైనింగ్ కంపెనీలు మారా హోల్డింగ్స్ షేర్లు 43 శాతం, రియోట్ ప్లాట్‌ఫామ్స్ షేర్లు 25 శాతం పడ్డాయి. క్రిప్టో ఎక్స్చేంజ్‌లు కాయిన్‌బేస్ గ్లోబల్, బుల్లిష్ షేర్లు వరుసగా 29 శాతం, 37 శాతం నష్టపోయాయి.
క్రిప్టో ఈటీఎఫ్‌ల గతి అంతే..
బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ల ఏర్పాటుకు కిందటేడాది జనవరిలో అమెరికా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అప్పటి నుంచి మార్కెట్‌లో క్రిప్టో ఈటీఎఫ్‌లు భారీగా పెరిగాయి. కేవలం స్పాట్ ఈటీఎఫ్‌లే కాకుండా లెవరేజ్డ్ ఈటీఎఫ్‌లు కూడా పెరిగాయి. లెవరేజ్డ్ ఈటీఎఫ్‌లు ఇన్వెస్టర్ల నుంచే కాకుండా ఇతరుల నుంచి కూడా ఫండ్స్ సేకరించి, క్రిప్టోలో ట్రేడింగ్ చేస్తాయి.
అతిపెద్ద లెవరేజ్డ్ ఈటీఎఫ్‌లు ఎంఎస్‌టీయూ, ఎంఎస్‌టీఎక్స్‌ల అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) 2024లో 4.7 బిలియన్ డాలర్లు (రూ.41 వేల కోట్లు) ఉండగా, ఇప్పుడు 831 మిలియన్ డాలర్ల(రూ.7 వేల కోట్ల) కు పడిపోయాయి. క్రిప్టో ఈటీఎఫ్‌తో ఇన్వెస్టర్లు మొత్తం 72 బిలియన్ డాలర్లు (రూ.6.4 లక్షల కోట్లు) నష్టపోయారు.
ఇండియాలో క్రిప్టో మార్కెట్..
ఇండియాలో సుమారు 12 కోట్ల మంది క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేస్తున్నారు. ఇక్కడ క్రిప్టో మార్కెట్ సైజ్ రూ.86 వేల కోట్ల దగ్గర ఉంది. ప్రభుత్వం క్రిప్టోలను లీగల్ టెండర్‌గా చూడకపోయినప్పటికీ, ట్రేడింగ్‌పై మాత్రం బ్యాన్ పెట్టలేదు. దీంతో వేగంగా క్రిప్టో ట్రేడర్లు పెరుగుతున్నారు. ఈ ఏడాది మే నెలలో బిట్‌కాయిన్ ధర లక్ష డాలర్లను దాటగా, ఆ తర్వాత క్రిప్టో ట్రేడింగ్ వాల్యూ 30 శాతం పెరిగిందని ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ కాయిన్‌స్విచ్ పేర్కొంది. దీనినిబట్టి తాజా క్రిప్టో మార్కెట్ క్రాష్‌లో ఇండియన్లు భారీగా నష్టపోయారని అర్థమవుతోంది.
స్ట్రాంగ్‌గా గోల్డ్..
ఒక వైపు డిజిటల్ గోల్డ్‌గా పరిగణించే బిట్‌కాయిన్ కంటే అసలైన బంగారం ఇన్వెస్టర్లకు భారీ లాభాలిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బిట్‌కాయిన్ ధర -2.7 శాతం పడగా, బంగారం మాత్రం 62 శాతం లాభం ఇచ్చింది. కానీ, ఇన్వెస్టర్లు మాత్రం ట్రెడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ల కంటే క్రిప్టోలకు మొగ్గు చూపుతున్నారు. గ్లోబల్‌గా గోల్డ్ రిజర్వ్‌ల విలువ 32 ట్రిలియన్ డాలర్లు ఉంటాయి. యూఎస్ గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి ఈ ఏడాది 43 బిలియన్ డాలర్ల ఇన్‌ఫ్లో జరిగింది.
మరోవైపు బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ కేవలం 3 ట్రిలియన్ డాలర్లే. అయినా, యూఎస్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లలోకి 44 బిలియన్ డాలర్లు ఇన్‌ఫ్లో జరగడం గమనార్హం. బిట్‌కాయిన్ ధర గత కొన్ని రోజులుగా రికవరీ అవుతోంది. ప్రస్తుతం 91 వేల డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని, బాండ్ కొనుగోళ్లు తిరిగి ప్రారంభిస్తుందనే అంచనాలతో ఈ క్రిప్టోకి కొంత సపోర్ట్
దొరుకుతోంది.
ఆల్‌టైమ్ హై నుంచి పడ్డ పాపులర్ క్రిప్టో కరెన్సీలు..(శాతాల్లో)
- సోలానా –41.2
- ఎథీరియం –35.2
- బైనాన్స్ కాయిన్ –27.6
- బిట్‌కాయిన్ –36
- ఎక్స్‌ఆర్‌పీ –27.4
- గత 50 రోజుల్లో క్రిప్టో స్టాక్స్ (శాతాల్లో)
- స్ట్రాటజీ ఐఎన్‌సీ –50.7
- మారా హోల్డింగ్స్ –42.6
- బుల్లిష్ –36.6
- మెటాప్లానెట్ –34.8
- కాయిన్‌బేస్ గ్లోబల్ –29.3
- స్పాట్ క్రిప్టో ఈటీఎఫ్‌ల రిటర్న్స్ (శాతాల్లో)
- ఐషేర్స్ ఎథీరియం ట్రస్ట్ ఈటీఎఫ్ –35.9
- గ్రేస్కేల్ బిట్‌కాయిన్ ట్రస్ట్ ఈటీఎఫ్ –27.9
- ఐషేర్స్ బిట్‌కాయిన్ ట్రస్ట్ ఈటీఎఫ్ –27.7
- ఫిడిలిటీ వైజ్ ఆరిజన్ బిట్‌కాయిన్ ఫండ్ –27.7
- లెవరేజ్డ్ ఈటీఎఫ్‌ల రిటర్న్స్ (శాతాల్లో)
- ఎంఎస్‌టీయూ –79
- ఎంఎస్‌టీఎక్స్ –79
