మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు ! షాపూర్నగర్లో ఆయా దాడి ఘటనే ఉదాహరణ

మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు ! షాపూర్నగర్లో ఆయా దాడి ఘటనే ఉదాహరణ
  • అమానవీయ ఘటనలు ఆపని ‘ఈ’ తరం
  • తాజాగా షాపూర్​నగర్​లో ఆయా దాడి ఘటనే ఉదాహరణ
  • చిన్నారిపై దాడి చేస్తున్నా.. వీడియో తీయడానికే పరిమితమైన వ్యక్తి

హైదరాబాద్​ సిటీ, వెలుగు: మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అని లోక కవి అందెశ్రీ అన్న మాటలు అక్షరసత్యాలని నిరూపిస్తున్న ఘటనలు నగరంలో రోజూ ఎక్కడోచోట కనిపిస్తూనే ఉన్నాయి. తోటి మనిషి ఆపదలో ఉంటే ఆదుకోవాల్సింది పోయి మనకెందుకులే అని వదిలేస్తున్నారు. ఏదైనా ఘటన జరిగితే దానికి ప్రత్యక్షసాక్షులుగా నిలిచినా.. తమకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడుతూ దాటేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా గాయపడిప్పుడు, రక్తమోడుతూ ప్రాణాపాయ స్థితిలో నిస్సహాయ స్థితిలో ఎదురుచూస్తున్నప్పుడు ‘పాపం’ అనుకుంటూ పోతున్నారే తప్పితే సాయం చేద్దామన్న ఆలోచన చేయడం లేదు. పైగా ఈ మధ్య ఇలాంటి ఘటనలను వీడియోలు తీసి సోషల్​ మీడియాలో షేర్​ చేయడం, రీల్స్​ కింద పెట్టడం సర్వసాధారణమైపోయింది.   

నివ్వెరపరిచిన షాపూర్​నగర్ ​ఘటన 
జీడిమెట్ల పీఎస్​ పరిధిలోని పూర్ణిమా విద్యానికేతన్​లో పని చేసే ఓ వృద్ధురాలు ఎంతో ఓపికతో ఉండాల్సింది పోయి.. చిన్నారి విసిగిస్తోందని విచక్షణారహితంగా చితకబాదింది.  దీన్నంతా స్కూల్​ పక్కన ఇంట్లో ఉండే వ్యక్తి వీడియో తీశాడు. సుమారు 4 :05 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఏదో ఒక సందర్భంలో ఆ దాడిని అడ్డుకోవాలని ఆ వ్యక్తి భావించలేదు. పైగా, తెల్లవారి ఆ వీడియోను స్నేహితులతో పాటు పలు వాట్సాప్​ గ్రూపుల్లో షేర్​ చేశాడు. 

అతడు చేసిన ఈ పని వల్ల ఈ ఘటన బయటకు వచ్చి పోలీసుల వరకూ వెళ్లింది. ఇది మంచిదే అయినా, దాడి జరుగుతున్నప్పుడే ఆపితే ఆ పాప తీవ్రంగా గాయపడకుండా, భవిష్యత్​లో ఆమె మానసిక స్థితిపై ప్రభావం చూపకుండా ఉండి ఉండేది. రోడ్లపై జనాలంతా చూస్తుండగా కత్తులతో పొడిచే సందర్భాల్లో అడ్డుకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అనుకోవచ్చు. కానీ, నిస్సహాయురాలైన చిన్నారిని ఓ వృద్ధురాలు చచ్చేలా కొడుతున్నా ఆపాలన్న ఆలోచన ఎందుకు రాలేదన్నదే ప్రశ్న.   

హ్యూమన్​ నేచర్​ మారిపోయింది..
‘సెల్​ఫోన్​ విప్లవం రావడంతో ఇప్పుడున్న సమాజంలో వీడియోలు తీసే కల్చర్​ పెరిగిపోయింది. ఇది అలవాటుగా మారింది. అదే ఫ్లోలో ఏదైనా ఘటన జరిగితే వీడియో తీస్తున్నారు తప్పితే ఆపడం తమ పని కాదని భావిస్తున్నారు. పైగా ఇన్​స్టాలోనో, మరే ఇతర సోషల్​మీడియా ప్లాట్​ఫాంలో షేర్​ చేస్తే  లైక్స్​ వస్తాయని భావిస్తున్నారు’ అని మల్కాజిగిరిలో సైకియాట్రిస్ట్​గా పని చేస్తున్న డాక్టర్​ రిషికేష్ చెప్పారు. షాపూర్​నగర్ ఘటనలో వీడియో తీసిన వ్యక్తి  దాడిని అడ్డుకోకపోయినా గట్టిగా అరిస్తే ఆయా కొట్టడం ఆపే దన్నారు.  వీడియో తీసి ఏం జరిగిందో  బయటపెట్టాలన్న తాపత్రయం మాత్రమే కనిపిస్తోందన్నారు. ప్రస్తుత సమాజంలో హ్యూమన్​ నేచర్ అనేది ఎక్కడా లేదని, ఎస్కేపింగ్​ నేచర్​ పెరిగిపోయిందన్నారు. ఇది భవిష్యత్​కు అత్యంత ప్రమాదకరమన్నారు. 

స్కూల్లో చిన్నారిపై ఆయా పైశాచికం
ఓ పాఠశాలలో చిన్నారిపై ఆయా క్రూరత్వం ప్రదర్శించింది. చిన్నారిని నేలకేసి కొట్టడమే కాకుండా కిందేసి తొక్కుతూ పైశాచికంగా వ్యవహరించింది. వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల షాపూర్​నగర్​లోని పూర్ణిమా విద్యానికేతన్ స్కూల్​లో ఒడిశాకు చెందిన కలియా, సంతోషి దంపతులు ఆయాలుగా పనిచేస్తున్నారు. వీరి నాలుగేండ్ల పాప ధరిత్రి ఇదే స్కూల్లో నర్సరీ చదువుతోంది. సంతోషి దంపతులకు శనివారం సాయంత్రం బస్సు డ్యూటీ పడగా, చిన్నారి స్కూల్​లోనే ఉంది. 

ఈ క్రమంలో చిన్నారి పదేపదే బాత్​రూమ్​కు తీసుకెళ్లామని చెప్పడంతో అందులో పనిచేసే మరో ఆయా లక్ష్మి క్రూరంగా ప్రవర్తించింది. చేతులతో కొడుతూ, కింద పడేసి తంతూ, జుట్టు పట్టుకుని లాగుతూ హింస పెట్టింది. పాపను కొడుతూ బాత్​రూంకు తీసుకువెళ్లడం దగ్గరి నుంచి ..బయటకు వచ్చాక కొడుతూ, కింద పడేసి దొర్లిస్తూ,  తలను నేలకేసి బాదుతూ, కడుపుపై పిడిగుద్దులు కురిపిస్తూ, గొంతు పిసుకుతూ తీవ్రమైన హింసకు గురిచేసింది. చివరకు చిన్నారి నేలకేసి కొట్టడంతో కాళ్లపై నిలబడి తొక్కింది. 

వాట్సాప్​ గ్రూపుల్లో వీడియో షేరింగ్
ఈ దాడిని వీడియో తీసిన పక్కింటి వ్యక్తి సోషల్​మీడియా గ్రూపుల్లో షేర్​ చేయగా బయటకు వచ్చింది. వీడియో ఆధారంగా చిన్నారి తల్లిదండ్రులు ఆదివారం కంప్లయింట్​ ఇవ్వగా జీడిమెట్ల పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. వీడియో వైరల్ ​కావడంతో  స్పందించినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతున్న చిన్నారిని బాలానగర్​ ఏసీపీ నరేశ్​రెడ్డి పరామర్శించారు. చైల్డ్​వెల్ఫేర్​ కు సమాచారం ఇచ్చామన్నారు.  ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.