తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్‌గఢ్ నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, జంపన్న, నాగులమ్మకు ముడుపులు కట్టారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం గద్దెల వద్దకు చేరుకొని అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఎత్తు బంగారం, నూతన వస్త్రాలు, పసుపుకుంకుమ, గాజులు, పూలు, చీరె సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు మేకలు, కోళ్లను బలి ఇచ్చి అడవిలోనే వంటవార్పు చేసుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎండోమెంట్ ఆఫీసర్లు తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించారు. గద్దెల వద్ద తొక్కిసలాట జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
