హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్ సమస్యల పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ మార్చి నెలలో ప్రతి ఆదివారం (1, 8, 15, 22, 29 తేదీల్లో) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, వాల్యుయేషన్ అధికారులు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు హాజరై పన్ను సమస్యలను నేరుగా స్వీకరించనున్నారు.
పన్ను అంచనాల సవరణలు, రివిజన్ పిటిషన్లు, ఆన్లైన్ చెల్లింపుల నమోదు, బకాయిల సర్దుబాటు, కోర్టు కేసుల వంటి తదితర పన్ను సంబంధిత అన్ని అంశాలను ఈ వేదికపై పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోనున్నారు. ప్రతి కేంద్రంలో కంప్యూటర్లు, ప్రింటర్లతో కూడిన మూడు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా, దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, ముఖ్యంగా రివిజన్ పిటిషన్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పన్ను సంబంధిత సమస్యలున్న పౌరులు అవసరమైన పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ‘వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)’ పథకం ద్వారా పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు ఈ స్కీమ్ అమల్లో ఉండనుందన్నారు.
