
- రోడ్లపై గుంతల ఫొటోతో యాప్ లో ఫిర్యాదు చేసే అవకాశం
- రోడ్ల కటింగ్, ఫుట్ పాత్ లు, వ్యర్థాలు ఇతర సమస్యలకూ పరిష్కారం
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో రోడ్ల రిపేర్లలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు బల్దియా పబ్లిక్ సేఫ్టీ యాప్ను తీసుకురాబోతోంది. వర్షాల కారణంగా రోడ్లపై ఏర్పడిన గుంతలు, ఇతర రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఈ యాప్ ను అందుబాటులోకి తేబోతోంది. రోడ్లపై ఎక్కడైనా గుంతలు ఉంటే వెంటనే యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. రోడ్లపై ఉన్న గుంత లేదా సమస్యకు సంబంధించిన ఫొటోను యాప్‌లో అప్లోడ్ చేసి లొకేషన్ ఇస్తే సరిపోతుంది.
యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదును అధికారులు పరిష్కరిస్తారు. ఇందుకోసం 30 సర్కిళ్లలో 30 మంది అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)లను బాధ్యులుగా నియమించారు. వీరు సొంతంగా రోడ్ల స్థితిని తెలుసుకొని పరిష్కరించడంతో పాటు ఫిర్యాదు వచ్చిన ప్రాంతంలో పనులు చేయించాల్సి ఉంటుంది. ఇప్పటికే యాప్ కూడా సిద్ధమైంది. అయితే, ఎన్నికల కోడ్ ఉండడంతో ఎలక్షన్లు ముగిసిన తర్వాత అధికారికంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫిర్యాదుదారులు చేసిన ఫిర్యాదు ఏ స్టేజీలో ఉందో కూడా చూసుకోవచ్చు. సమస్య పరిష్కారమైన తర్వాత ఫీడ్‌బ్యాక్ ఇచ్చే ఆప్షన్ కూడా ఉంటుంది.
ఈ సమస్యలకే పరిష్కారాలు
బల్దియా ఇప్పటికే జియో ఇన్ఫర్ మేషన్ సిస్టం(జీఐఎస్) సర్వే చేసి రోడ్ల మ్యాపింగ్ చేసింది. దీనివల్ల రోడ్ల రిపేర్ల కోసం వచ్చిన ఫిర్యాదుల లోకేషన్ ను జియో ట్యాగింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. సర్కిళ్లలోని అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ)లు ఫీల్డ్ వర్క్ చేసి రోడ్ల సమస్యతో పాటు ఇతర సమస్యలుంటే ఫొటోలు తీసి పబ్లిక్ సేఫ్టీ యాప్ లో పొందుపరుస్తారు. రిపేర్ల తర్వాత కూడా వాటి వివరాలను అప్లోడ్చేస్తారు. తమ పరిధిలోని రోడ్లను రెగ్యులర్ గా తనిఖీలు చేస్తారు.
30 సర్కిళ్లలోని ఏఈల పనితీరును డీఈలు, ఈఈలు పరిశీలిస్తారు. రోడ్ల కటింగ్,రోడ్లపై రాళ్లు ఉండడం, ఫుట్ పాత్ లు, వ్యర్థాలు, జీబ్రా లైన్లు లేకపోవడం, లేన్ మార్కింగ్ మిస్సింగ్, సూచిక బోర్డులు, స్ట్రామ్వాటర్ డ్రెయిన్ల కవర్లు మిస్సింగ్, రోడ్లపై లీకేజీలు, రోడ్లపై మురుగుపారడం, తాగునీటి పైపులు పగిలి రోడ్డుపైకి నీళ్లు రావడం, పనులు జరుగుతున్న ప్రాంతాల్లో బారికేడ్లు లేకపోవడం, వాటర్ స్ట్రాగినేషన్ తదితర సమస్యలను ఏఈలు పరిష్కరించాల్సి ఉంటుంది.
ఇప్పటికే గ్రేటర్ లోని150 వార్డులకు150 లాగిన్లు కూడా కేటాయించారు. ప్రజలు యాప్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత, ఆ కంప్లయింట్ఏ అధికారికి కేటాయించారు? రిపేర్లు ఎప్పుడు ప్రారంభమయ్యాయన్న దాంతో పాటు ఫిర్యాదు ఎప్పుడు పూర్తయ్యిందన్న వివరాలు ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌డేట్ చేస్తారు. వార్డు, సర్కిల్ అధికారులు జియో మ్యాపింగ్ తో ప్రతి రెండు నెలలకోసారి పాత సమాచారాన్ని తొలగించి, కొత్త సమాచారాన్ని యాప్ లో పొందుపరచాల్సి ఉంటుంది.