
- ప్రజలు, వాకర్ల నుంచి ఫిర్యాదులు
- కొత్తవి ఏర్పాటుకు బల్దియా ఆదేశాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని పార్కుల్లో రిపేర్లు చేయాలని బల్దియా నిర్ణయం తీసుకుంది. ఏండ్లుగా పార్కులను పట్టించుకోకపోవడంతో పార్కుల్లోని వాకింగ్ ట్రాక్‌లు. ఆట వస్తువులు తదితర మెటిరీయల్స్ పాడయ్యాయి. ఒక్కో చోట ఒక్కో వస్తువు పాడైందని జీహెచ్ఎంసీకి ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్కుల్లో ఒకేసారి అవసరమైన రిపేర్లు చేయాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించి జోనల్ స్థాయిలో పనులు చేయించనున్నారు.
గ్రేటర్లో 985 పార్కులు
గ్రేటర్ పరిధిలో 985 పార్కులుండగా, ఇందులో 19 మేజర్ పార్కులు,17 థీమ్ పార్కులు, మిగతావి కాలనీల్లో పార్కులు. ఇందులో వందకుపైగా పార్కులను జీహెచ్ఎంసీ మెయింటెనెన్స్ చేస్తుండగా, మరికొన్ని పార్కులను నిర్వహణ కోసం కాంట్రాక్టర్లకు అప్పగించారు. 753 పార్కుల మెయింటెనెన్స్‌ను ఆయా కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్లకే జీహెచ్ఎంసీ అప్పగించింది. మెయింటెనెన్స్ కోసం అవుతున్న ఖర్చులో 75 శాతం కాలనీ వెల్పేర్ అసోసియేషన్లకు అందజేస్తోంది.
అలాగే, కాలనీల్లోని పార్కుల కోసం ఖర్చు చేస్తున్నప్పటికీ వాకర్స్ కు ఇబ్బందులు తప్పడంలేదు. కొన్ని పార్కుల్లో కనీసం వాకర్స్ నడవడానికి ట్రాక్ లు కూడా సక్రమంగా లేవు. కొన్ని పార్కుల ప్రహరీ గోడలు కూలినా పట్టించుకోవడంలేదు. స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో సాయంత్రం అయితే పార్కుల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ లోని అన్ని పార్కుల్లో ఒకేసారి అవసరమైన రిపేర్లు చేస్తే కొన్నేండ్లపాటు ఇబ్బందులుండవని కమిషనర్ భావిస్తున్నారు. త్వరలో ఈ పనులను స్టార్ట్ చేయనున్నారు.