
గచ్చిబౌలి, వెలుగు: జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్లో ఉన్నతాధికారులు కొత్త పద్ధతిని అవలంభించారు. ఎన్నడూ లేని విధంగా డ్రా సిస్టం ద్వారా టౌన్ ప్లానింగ్ విభాగంలో చైన్మెన్లను కేటాయించారు. ఇటీవల జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో చైన్మెన్ల బదిలీ జరిగింది. శేరిలింగంపల్లి జోన్‌కు ఏడుగురు చైన్మెన్లను కేటాయించారు.
వీరంతా తమకు ఆమ్దాని వచ్చే సర్కిల్లో పోస్టు ఇవ్వాలంటూ రాజకీయ నాయుకులు, యూనియన్ లీడర్ల పైరవీలు చేస్తున్నారు. దీంతో జోన్ ఉన్నతాధికారులు చైన్మెన్లకు సర్కిల్లను కేటాయించడంలో కొంత ఆలస్యం చేశారు. ఈ క్రమంలో డ్రా సిస్టం ద్వారా సర్కిల్ కార్యాలయాలకు చైన్మెన్లను కేటాయించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
జోనల్ సీపీ ఆధ్వర్యంలోనే ఈ తతంగం నడవగా, దీనికి జోనల్ కమిషనర్ ఓకే చెప్పడం విశేషం. సిటీ ప్లానర్ ఆధ్వర్యంలోనే ఈ డ్రా సిస్టం నిర్వహించారని జోనల్ అధికారులు తెలిపారు. సోమవారం చందానగర్ సర్కిల్ కార్యాలయంలో ఇద్దరు చైన్మెన్లు, శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో ముగ్గురు, యూసఫ్‌గూడ, పటాన్చెరు సర్కిల్ కార్యాలయాలకు ఒక్కో చైన్‌మెన్‌ను కేటాయించగా, ప్రస్తుతం వారు విధుల్లో చేరారు.