- అత్యవసరమైతే సేల్ డీడ్ చేసుకోవాలని సూచన
- అదనపు భారం పడుతుండడంతో ఇబ్బందులు పడుతున్న రైతులు
జమ్మికుంటకు చెందిన రాజేందర్‌రెడ్డి అనే వ్యక్తి పెళ్లయిన తన కూతురికి గిఫ్ట్ కింద ఎకరం వ్యవసాయ భూమి ఇవ్వాలనుకున్నారు. భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు స్లాట్ బుకింగ్ కోసం నెల రోజుల కింద మీ – సేవ కేంద్రానికి వెళ్లాడు. ఈ క్రమంలో అన్ని వివరాలు ఎంట్రీ చేశాక పేమెంట్ ఆప్షన్ వచ్చే సరికి ప్రాసెస్ ఆగిపోయింది. తర్వాత పలుమార్లు ప్రయత్నించినా సేమ్ సీన్ రిపీట్ కావడంతో రిజిస్ట్రేషన్‌ను వాయిదా వేసుకున్నారు.
కరీంనగర్, వెలుగు : భూభారతి పోర్టల్‌లో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్స్ ఆగిపోయాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ సమస్య తలెత్తినా ఆఫీసర్లు ఇప్పటివరకూ సరిదిద్దలేదు. దీంతో తమ పిల్లల పేరిట భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేద్దామనుకొని స్లాట్ బుకింగ్ కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్తున్న రైతులు నిరాశగా వెనుదిరుగుతున్నాయి. అత్యవసరమైన వారు తప్పని పరిస్థితుల్లో సేల్ డీడ్ చేసుకుంటున్నారు. కానీ దీని వల్ల అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆఫీసర్లను అడిగితే టెక్నికల్ ప్రాబ్లం కారణంగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల స్లాట్ బుక్ కావడం లేదని, ఈ విషయంలో తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు.
సగంలోనే ఆగిపోతున్న ప్రాసెస్
సాధారణంగా భూభారతి పోర్టల్‌లో గిఫ్ట్ డీడ్ స్లాట్ బుక్ చేసుకునేందుకు గిఫ్ట్స్ మాడ్యూల్ ఓపెన్ చేయగానే రిజిస్ట్రేషన్ నేచర్ ఆఫ్ డీడ్ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో గిఫ్ట్ ఫర్ ఛారిటబుల్ రిలిజీయస్ పర్పస్, గిఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, గిఫ్ట్ ఇన్ లోకల్ బాడీస్, గిఫ్ట్ ఇన్ అదర్స్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి.
ఇందులో గిఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ అనే ఆప్షన్ ఎంచుకుంటే.. ఇందులో ఎవరికైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో వారి వివరాలతో పాటు గిఫ్ట్ ఇచ్చే వారి పట్టాదార్ పాస్‌బుక్ నంబర్ ఎంట్రీ చేయాలి. ఇంతవరకు బాగానే ఉన్నా... ఆ తర్వాత చెల్లించాల్సిన చలానా అమౌంట్ ఎంత అనే ఆప్షన్ ఓపెన్ కావడం లేదు. దీంతో పేమెంట్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
గిఫ్ట్ బదులు సేల్ డీడ్
గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో కూతుళ్ల పెళ్లిండ్లు పెట్టుకున్న వారు, కుమారుల మధ్య ఆస్తి పంపకాలకు అత్యవసరమైన వారు సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. అయితే గిఫ్ట్ డీడ్‌కు ల్యాండ్ మార్కెట్ వాల్యూ పైన మూడు శాతం స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉండగా, సేల్ డీడ్‌కు 7.5 శాతం చెల్లించాలి. దీంతో స్టాంప్ డ్యూటీ 150 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తోందని, దీని వల్ల ఆర్థిక భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
