స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి బాలిక సూసైడ్.. టీచర్ల వేధింపులే కారణం..!

స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి బాలిక సూసైడ్.. టీచర్ల వేధింపులే కారణం..!

జల్నా: స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని జల్నా సిటీలో ఈ ఘటన జరిగింది. ఉపాధ్యాయుల వేధింపులు, చిత్రహింసల వల్లే తన కుమార్తె సూసైడ్ చేసుకుందని బాలిక తండ్రి ఆరోపించారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జల్నా జిల్లాలోని సీటీఎంకే గుజరాతీ స్కూల్‎లో ఆరోహి దీపక్ బిడ్లాన్ (13) ఎనిమిదో తరగతి చదువుతోంది. 

తన కుటుంబంతో కలిసి మస్తగడ్‎లో నివసిస్తున్నది. ఆరోహి తండ్రి దీపక్ అశోక్ బిడ్లాన్ ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు. రోజూ మాదిరిగానే ఆరోహి స్కూల్ కు వెళ్లింది. శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8 గంటల మధ్య స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది. స్కూల్ యాజమాన్యం వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించింది. 

అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించింది. ఆరోహి తండ్రి ఆస్పత్రికి వెళ్లేసరికి ఆమె బతికే అవకాశాలు తక్కువని డాక్టర్లు తెలిపారు. అనంతరం సివిల్ హాస్పిటల్ కు రిఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. టీచర్ల వేధింపులు, చిత్రహింసల వల్లే  ఆరోహి సూసైడ్ చేసుకుందని ఆమె తండ్రి ఆరోపించారు.