మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థిని దారుణ హ‌త్య‌

మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థిని దారుణ హ‌త్య‌

మహబూబాబాద్ జిల్లా: ఇంటర్ విద్యార్థినిపై దుండ‌గులు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లాలో జ‌రిగింది. మరిపెడ మండలం, ధర్మారం శివారు, సీతారాంపుర తండాకు చెందిన మోడు ఉష (18)ను కిరాతకంగా హత్య చేశారు దుండగులు. తండాకు సమీపంలోని గుట్టల్లో రక్తస్రావంతో శవమై కనిపించిన ఉషను స్థానికులు గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. డెడ్ బాడీని పోస్ట్ మార్ట‌మ్ కోసం మ‌హ‌బూబాబాద్ జిల్లా హాస్పిట‌ల్ త‌ర‌లించారు. యువ‌తి త‌ల్లిదండ్రులు, బంధువుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌న్నారు.

ఉష కుటుంబానికి అండగా ఉంటాం
గిరిజన బాలిక మోడు ఉష హత్యపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన నేరస్తున్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. ఉష మృతికి సంతాపం తెలిపిన‌ మంత్రి సత్యవతి రాథోడ్.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటామని, ఆర్ధికంగా చేయుతనిస్తామన్నారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న అమ్మాయి పట్ల ఇలాంటి దారుణం జరగడం క్షమించరానిదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకు అనేక చర్యలు చేపడుతున్నా కొంతమంది దుర్మార్గులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వం వీరిపట్ల కఠినాతికఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఇలాంటి దారుణాలు జరగకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతామన్నారు మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్.