ఎన్నికల డ్యూటీల సిబ్బంది వివరాలు ఇవ్వండి : శశాంక

ఎన్నికల డ్యూటీల సిబ్బంది వివరాలు ఇవ్వండి :  శశాంక

ఎల్​ బీనగర్,వెలుగు : పార్లమెంటు ఎన్నికల్లో డ్యూటీ చేసే వివిధ శాఖల సిబ్బంది పూర్తి వివరాలు అందజేయాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో వివిధ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు  ఆయా శాఖలు సిబ్బంది వివరాలు పూర్తిస్థాయిలో అందించాలని ఆదేశించారు. ఇంటి చిరునామాలు, ఎపిక్ కార్డుల వివరాలు తప్పనిసరి అని, ఇంకా ఇవ్వకుంటే వెంటనే జిల్లా పరిశ్రమల శాఖకు అందించాలని సూచించారు. కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ తక్షణమే అమలులోకి వచ్చిందని, ఇది జూన్ 6వ తేదీ వరకు అమలులో ఉంటుందని తెలిపారు. సిబ్బందికి ఎలాంటి సెలవులు ఇవ్వరాదని, ఆఫీసుల్లో ఎలాంటి క్యాలెండర్స్, ప్రభుత్వ పబ్లిసిటీ మెటీరియల్ లేకుండా చూడాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ బ్రేక్ చేయొద్దని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.