డీఈవోలకు ఆదేశాలిచ్చిన హైకోర్టు 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఊరట
హైదరాబాద్, వెలుగు: టీచర్ పోస్టుల నియామకానికి ఉమ్మడి ఏపీలో 1998 లో నిర్వహించిన డీఎస్సీలో అర్హత పొందిన వారికి అనుకూలంగా హైకోర్టు మరోసారి ఆదేశాలిచ్చింది. అప్పటి డీఎస్సీలో అర్హులను ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల్లో నియమించాలని ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 2009 డిసెంబర్ లో ఇచ్చిన ఉత్తర్వుల్ని అమలు చేయాల్సిందేనని4 జిల్లాల డీఈవోలను బుధవారం ఆదేశించింది.
ఇదే తరహాలో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల డీఈవోలకు 2 నెలల జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా పడటంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యాలపై కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. 2009లో ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల్ని 4 వారాల్లోగా అమలు చేయాల్సిందేనని డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. అప్పటి వరకు సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్ష తీర్పు అమలును రద్దు చేసింది. విచారణ నెల రోజులకు వాయిదా పడింది.

