ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్.. ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన ఆదేశాలు..

ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్.. ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన ఆదేశాలు..

గ్రహాంతర వాసులు అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అసలు ఈ భూమిపై వేరే గ్రహాలకు చెందిన ప్రాణులు ఉన్నాయా.. ఉంటే అవి ఎక్కడ తిరుగుతున్నాయ్ అనే అనుమానాలు చాలా మందికి ఉన్న సంగతి తెలిసిందే. అయితే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో వీటికి సంబంధించిన సీక్రెట్స్ దాచబడ్డాయి అనే ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్న వేళ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 

అమెరికాలో ఏలియన్స్, యూఎఫ్ఓల వ్యవహారం మరోసారి రాజకీయ సెంటర్‌ స్టేజ్‌లోకి వచ్చింది. గ్రహాంతరవాసుల ఉనికిపై దశాబ్దాలుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించేలా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రహాంతరవాసులు, గుర్తు తెలియని ఎగిరే వస్తువులకు సంబంధించిన రహస్య ప్రభుత్వ ఫైళ్లను గుర్తించి.. వాటిని బహిర్గతం చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. దీనిపై ఆయన తన ట్రూత్ సోషల్ వేదికగా స్పందిస్తూ.. ప్రజల్లో ఉన్న విపరీతమైన ఆసక్తిని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ALSO READ : భారత్-పాక్ యుద్ధంలో11 జెట్స్ కూలిపోయాయి.. 

ఈ వివాదం మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యల నుండే మొదలైంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడుతూ.. గ్రహాంతరవాసులు నిజమే కావచ్చు కానీ, తాను వారిని చూడలేదని అన్నారు ఒబామా. అమెరికాలోని ఏరియా 51లో వారిని దాచిపెట్టారనే ప్రచారంలో నిజం లేదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తన అధ్యక్ష కాలంలో ఏలియన్స్ భూమిని సంప్రదించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఒబామా ఇలాంటి రహస్య సమాచారాన్ని బహిరంగంగా చర్చించడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. క్లాసిఫైడ్ సమాచారాన్ని ఒబామా బయటపెట్టి పెద్ద తప్పు చేశారంటూ మండిపడ్డారు.

ఏలియన్స్ నిజంగా ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని మాత్రం బయటపెడతానంటూ జార్జియా పర్యటనలో ఉన్న ట్రంప్ ప్రకటించారు. పెంటగన్ గతంలో ఇచ్చిన నివేదికల ప్రకారం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గ్రహాంతర సాంకేతికతకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆకాశంలో కనిపించిన వింత వస్తువులు సహజమైనవి కావచ్చని పేర్కొన్నాయి. అయినప్పటికీ ట్రంప్ ఇప్పుడు ఏకంగా 'సెక్రటరీ ఆఫ్ వార్' ఇతర ఏజెన్సీలను రంగంలోకి దింపి ఈ రహస్య పత్రాల వేట మొదలుపెట్టడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. 

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అగ్రరాజ్యం వద్ద ఏలియన్స్‌కు సంబంధించి ఏదైనా గుట్టు ఉందా? లేదా ఇది కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ట్రంప్ ఆదేశాలతో దశాబ్దాలుగా మూలనపడి ఉన్న ఏలియన్ ఫైల్స్ బయటకు వచ్చే అవకాశం ఉండటంతో ఊహాజనిక సిద్ధాంతాలను నమ్మేవారు, శాస్త్రవేత్తలు దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఖగోళ రహస్యాలు బయటకు వస్తాయని.. చాలా మంది ప్రశ్నలకు జవాబు దొరుగుతుందనే ఆసక్తి ట్రంప్ ఆదేశాలతో పెరిగింది.