అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మరోసారి భారత్-పాక్ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశంలో మాట్లాడుతూ.. 2025 మే నెలలో భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తానే స్వయంగా జోక్యం చేసుకుని ఆపానని గొప్పలు చెప్పుకున్నారు. యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతున్న సమయంలో రెండు దేశాల అధినేతలకు ఫోన్ చేసి.. యుద్ధం ఆపకపోతే 200 శాతం టారిఫ్స్ విధిస్తానని బెదిరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ఈ యుద్ధంలో 11 యుద్ధ విమానాలు కుప్పకూలాయంటూ పేర్కొన్నారు. అయితే అవి ఏ దేశానివనే వివరాలు వెల్లడించలేదు.
ఈ సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. యుద్ధం తీవ్రంగా జరుగుతోందని.. యుద్ధ విమానాలు కూలిపోతున్నాయని ట్రంప్ చెప్పారు. అందుకే తానే ప్రధాని మోడీతో పాటు పాక్ ప్రధానితో మాట్లాడానంటూ చెప్పుకొచ్చారు. మీరు గొడవ పడటం ఆపకపోతే రెండు దేశాలపై 200 శాతం టారిఫ్విధిస్తానని హెచ్చరించినట్లు చెప్పారు ట్రంప్. యుద్ధం కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి.. ఆ దెబ్బకు రెండు దేశాలు శాంతించాయని ప్రెసిడెంట్ వివరించారు. తన చొరవ వల్ల దాదాపు రెండున్నర కోట్ల మంది ప్రాణాలు కాపాడబడ్డాయని చెప్పుకొచ్చారు.
వాషింగ్టన్ డీసీలోని 'డొనాల్డ్ జే ట్రంప్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్' వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో భారత్ కేవలం అబ్జర్వర్ హోదాలో మాత్రమే పాల్గొంది. భారత రాయబార కార్యాలయ ప్రతినిధి నమ్గ్యా ఖంపా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ట్రంప్ చేసిన ఈ మధ్యవర్తిత్వ వాదనలను భారత్ మొదటి నుంచీ ఖండిస్తూనే ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తలెత్తిన ఉద్రిక్తతల సమయంలో ఏ దేశపు జోక్యం లేదని, భారత్ తన సొంత వ్యూహాలతోనే పరిస్థితిని చక్కదిద్దిందని ప్రధాని మోడీ గతంలోనే స్పష్టంగా చెప్పినప్పటికీ ట్రంప్ మాత్రం ఆ క్రెడిట్ కోసం వీలు కుదిరినప్పుడల్లా తానే యుద్ధం ఆపానంటూ డప్పు కొట్టుకుంటున్నారు.
మరోవైపు పాకిస్థాన్ మాత్రం ట్రంప్ వాదనను పూర్తిగా సమర్థిస్తోంది. పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, ప్రధాని షరీఫ్ ఏకంగా ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఒక శాంతి దూత అంటూ షరీఫ్ కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్న తీరు అప్పులకోసమేనని తెలుస్తోంది. మెుత్తానికి ట్రంప్ తన వ్యాపార దృక్పథంతో అంతర్జాతీయ దౌత్య నీతిని నడుపుతున్నారని, సుంకాలనే అస్త్రాలుగా వాడుతూ శాంతిని నెలకొల్పుతున్నానని చెప్పుకోవడం ఆయన అగ్రరాజ్య అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేయాలనే తాపత్రయాన్ని చూపిస్తోంది. భారత్ ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తూ ట్రంప్ వ్యాఖ్యలకు దూరంగా ఉంటోంది.
