బాకీలు తీర్చడానికి మూడేళ్లు టైమివ్వండి

బాకీలు తీర్చడానికి మూడేళ్లు టైమివ్వండి

న్యూఢిల్లీ : ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపుల విషయంలో  టెలికం కంపెనీలకు మూడేళ్ల గడువు ఇవ్వాల్సిందిగా సెల్యులార్‌‌ ఆపరేటర్స్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (సీఓఏఐ) కోరింది. మూడు నెలల్లో  ఏజీఆర్‌‌ బకాయిలు చెల్లించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టెలికం కంపెనీలు నష్టాల పాలయ్యాయని సీఓఏఐ డైరెక్టర్‌‌ జనరల్‌‌ రాజన్‌‌ మాథ్యూస్‌‌ చెప్పారు. కాబట్టి, టెలికం కంపెనీలు చెల్లించాల్సిన మొత్తాలకు వ్యవధి ఇవ్వాలని, అప్పులనూ పునర్‌‌ వ్యవస్థీకరించాలని కోరారు. 4 జీ లైసెన్సులకు మరో 11 ఏళ్లు గడువుందని చెబుతూ, ఆ గడువు ముగిసేలోపు బకాయిలను రాబట్టుకోవచ్చని సూచించారు.

ఏజీఆర్‌‌ (అడ్జస్టెడ్‌‌ గ్రాస్‌‌ రెవెన్యూ) విధానంలో మార్పులూ తేవాలని పేర్కొన్నారు. సెప్టెంబర్‌‌తో ముగిసిన క్వార్టర్లో లిస్టెడ్‌‌ టెలికం కంపెనీల మొత్తం నష్టాలు రూ. లక్ష కోట్లను మించాయని చెప్పారు. దేశంలోని రెండు దిగ్గజాలు వొడాఫోన్‌‌ ఐడియా, భారతి ఎయిర్‌‌టెల్‌‌లు కలిపి రూ. 74 వేల కోట్ల నష్టాన్ని ప్రకటించాయన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల వల్లే ఈ కంపెనీలకు నష్టాలు పెరిగాయని మాథ్యూస్‌‌ పేర్కొన్నారు. ఆ రూలింగ్‌‌తో ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తానికి ప్రొవిజన్స్‌‌ను ఈ కంపెనీలు ఏర్పాటు చేయవలసి వచ్చిందని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఏజీఆర్‌‌ బకాయిలను మూడు నెలల్లో చెల్లించమంటూ  డాట్‌‌ టెలికం కంపెనీలకు నోటీసులు పంపింది కూడా. సెల్ఫ్‌‌ ఎసెస్‌‌మెంట్‌‌ ప్రాతిపదికన ఈ చెల్లింపులు జరిపేందుకు ఆ కంపెనీలకు ఆప్షన్‌‌ను డాట్‌‌ ఇచ్చింది.