సైనిక్ స్కూల్ ఇవ్వండి.. అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూములివ్వండి

సైనిక్ స్కూల్ ఇవ్వండి.. అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూములివ్వండి
  • డిఫెన్స్ మినిస్టర్ రాజ్​నాథ్​సింగ్​కు రేవంత్ విజ్ఞప్తి
  • పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు వినతి

న్యూఢిల్లీ, వెలుగు :  తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శుక్రవారం ఢిల్లీలో రాజ్ నాథ్ తో రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రేవంత్ వినతిపత్రాలు అందజేశారు. హైద‌రాబాద్ సిటీలో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ ప‌రిధిలో ఉన్న భూములను కేటాయించాల‌ని విజ్ఞప్తి చేశారు. ‘‘హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ర‌ద్దీని నివారించేందుకు మెహిదీప‌ట్నం రైతు బ‌జార్ వ‌ద్ద స్కైవాక్ నిర్మిస్తున్నాం. ఇందుకోసం అక్కడున్న 0.21 హెక్టార్ల డిఫెన్స్ ల్యాండ్ ను బ‌దిలీ చేయండి. ఇక్కడ తప్ప.. మిగిలిన చోట్ల స్కైవాక్ నిర్మాణం దాదాపు పూర్తయింది” అని రాజ్ నాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ‘‘హైద‌రాబాద్ నుంచి క‌రీంన‌గ‌ర్‌- వెళ్లే రాజీవ్ ర‌హ‌దారిలో ప్యార‌డైజ్ జంక్షన్ నుంచి అవుట‌ర్ రింగు రోడ్డు జంక్షన్ వ‌ర‌కు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ (11.30 కిలోమీటర్లు) నిర్మాణంతో పాటు ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 83 ఎక‌రాల ర‌క్షణ శాఖ భూమి అవ‌స‌ర‌ం. నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్‌-44)పై కండ్లకోయ స‌మీపంలోని ప్యార‌డైజ్ జంక్షన్ నుంచి అవుట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు ఎలివేటెడ్ కారిడార్ (18.30 కి.మీ) ప్రతిపాదించాం. ఇందులో 12.68 కిలోమీట‌ర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలు పాయింట్లు, భ‌విష్యత్తులో డ‌బుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్‌, ఇత‌ర నిర్మాణాల‌కు మొత్తంగా 56 ఎక‌రాల డిఫెన్స్ భూములు కావాలి. తెలంగాణ అభివృద్ధి కోసం ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బ‌దిలీ చేయాలి” అని విజ్ఞప్తి చేశారు. కాగా, మెహిదీపట్నంలోని రైతుబజార్ వద్ద భూమి కేటాయించేందుకు రాజ్ నాథ్ సుముఖత వ్యక్తం చేసినట్టు సీఎంఓ వర్గాలు పేర్కొన్నాయి.

హైదరాబాద్ అభివృద్ధికి ఫండ్స్ ఇవ్వండి..

పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శుక్రవారం ఢిల్లీలో నిర్మలతో రేవంత్, ఉత్తమ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను రేవంత్ ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ‘‘వెనుక‌బడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కింద 2019–20, 2021–22, 2023–24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి తెలంగాణకు విడుదల చేయాల్సిన రూ.1,800 కోట్లు వెంటనే ఇవ్వండి. అలాగే 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణ‌కు రావాల్సిన రూ.2,233.54 కోట్లు రిలీజ్ చేయండి. హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించండి” అని విజ్ఞప్తి చేశారు.