
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్, వెలుగు: ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ ఇస్తే ఇబ్బంది ఏంటని సర్పంచ్‌లను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంలోనే ఈ నిబంధన పెట్టామని, దాని మీద ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్‌లు ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదన్నారు. అసెంబ్లీలో బుధవారం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాజకీయాల జోలికి వెళ్లకుండా సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు కలిసి పని చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. గ్రామాల సమగ్ర వికాసం కోసం ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంతగా 2,714 కోట్లను కేటాయించిందన్నారు. కొత్త పింఛన్‌దారులను 6 లక్షల మందిని గుర్తించామని, హైదరాబాద్‌లో గుర్తింపు పూర్తయితే అందరికీ పింఛన్లు ఇస్తామని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీలన్ని భర్తీ చేశామని, అన్ని జిల్లాల్లో సీఈవోలు, డీపీవోలు, ఈవోఆర్డీలను ప్రమోషన్ల ద్వారా నియమించామన్నారు. గతంలో జీపీ ఫండ్స్ అన్ని తాగునీటికి ఖర్చయ్యేవని, అలాంటి ఖర్చు లేకుండా మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వమే నీళ్లు ఇస్తోందన్నారు. సింగూరు ప్రాజెక్టులో నీళ్లు లేక మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని 2,640 ఆవాసాలకు భగీరథ నీళ్లు ఇవ్వలేకపోతున్నామని, ఆ రిజర్వాయర్‌కు నీళ్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.