తగ్గిన గ్లాండ్​ ఫార్మా లిమిటెడ్​ లాభం

తగ్గిన గ్లాండ్​ ఫార్మా లిమిటెడ్​ లాభం

న్యూఢిల్లీ: గ్లాండ్​ ఫార్మా లిమిటెడ్​ లాభం సెప్టెంబర్​తో ముగిసిన రెండో క్వార్టర్లో 20.14 శాతం తగ్గిపోయింది. ఈ క్వార్టర్లో కంపెనీకి రూ. 241.24 కోట్ల లాభం వచ్చింది. అమ్మకాలు తగ్గడంతోపాటు, ఖర్చులు పెరగడం వల్లే లాభాలు తగ్గినట్లు కంపెనీ తెలిపింది. అంతకు ముందు ఏడాది రెండో క్వార్టర్లో గ్లాండ్​ పార్మాకు రూ. 302.08 కోట్ల లాభం వచ్చింది. సెప్టెంబర్​ 2022 క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ. 1,044.40 కోట్లని, సెప్టెంబర్​ 2021 క్వార్టర్లో ఇది రూ. 1,080.47 కోట్లుగా ఉందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్​లో  పేర్కొంది. ఖర్చులు అంతకు ముందు ఏడాది రెండో క్వార్టర్లోని రూ. 731 కోట్ల నుంచి తాజా సెప్టెంబర్​ క్వార్టర్లో రూ. 785.95 కోట్లకు పెరిగినట్లు వివరించింది.

యూఎస్​, యూరప్​, కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్ల నుంచి ఆదాయం 3 శాతం పెరిగి రూ. 747.5 కోట్లయిందని కంపెనీ తెలిపింది. దేశీయ మార్కెట్​ రెవెన్యూ మాత్రం ఏకంగా 42 శాతం పడిపోయి రూ. 72.6 కోట్లకే పరిమితమైందని గ్లాండ్​ ఫార్మా పేర్కొంది. తమ  కొత్త ప్రొడక్టులకు పోటీ పెరిగిందని, కాకపోతే మరిన్ని కొత్త ప్రొడక్టులు పైప్​లైన్​లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. బయోసిమిలర్స్​ బిజినెస్​లో గ్రోత్​కు మంచి అవకాశాలున్నాయని గ్లాండ్​ పార్మా సీఈఓ శ్రీనివాస్​ సాదు చెప్పారు.