
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఐపీఎల్ తప్ప అన్ని టీ20 లీగ్ ల్లో చెలరేగుతాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ మినహాయిస్తే జాతీయ జట్టుతో పాటు ప్రపంచ టీ20 లీగ్ ల్లో ఈ ఆసీస్ పవర్ హిట్టర్ పూనకం వచ్చినట్టు ఆడతాడు. ఐపీఎల్ 2025లో ఘోరంగా విఫలమైన మ్యాక్స్ వెల్.. ఈ మెగా లీగ్ ముగిశాక మళ్ళీ తనలోని పూర్తి స్థాయి ఆట బయట పెట్టాడు. మేజర్ లీగ్ క్రికెట్ లో బుధవారం (జూన్ 18) వాషింగ్టన్ ఫ్రీడమ్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సీజన్ లో వాషింగ్టన్ ఫ్రీడమ్ తరపున ఆడుతున్న మ్యాక్స్ వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి 48 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఓవరాల్ గా 49 బంతుల్లో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాక్సీ ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్ లో కి వచ్చిన ఈ ఆసీస్ వీరుడు ప్రారంభంలో కాస్త తడబడ్డాడు. తనకు ఎదుర్కొన్న తొలి 15 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత అసలు విధ్వంసం స్టార్ట్ అయింది. తర్వాత తాను ఎదుర్కొన్న 34 బంతుల్లోనే ఏకంగా 94 పరుగులు చేయడం విశేషం.
మ్యాక్స్ వెల్ మెరుపు సెంచరీ (106)తో మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ 11 బంతుల్లోనే 32 పరుగులు చేసి పవర్ ప్లే లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 209 పరుగుల లక్ష్య ఛేదనలో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ కేవలం 95 పరుగులకే ఆలౌట్ అయింది. సైఫ్ బాదర్ 32 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. జాక్ ఎడ్వర్డ్స్, మైకెల్ ఓవెన్ తలో మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సెంచరీతో జట్టును గెలిపించిన మ్యాక్ వెల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
The two different versions of Glenn Maxwell 😅#GlennMaxwell #IPL2025 #MLC2025 #CricketTwitter pic.twitter.com/qDEwkmvLGR
— InsideSport (@InsideSportIND) June 18, 2025