కొంపముంచే కలుపు మందు.. బ్యాన్​ ఉన్నా సేల్స్​

V6 Velugu Posted on Jun 22, 2020

  • పదేళ్లలో రెట్టింపు అయిన గ్లైఫోసేట్ అమ్మకాలు
  • అగ్రి టాస్క్​ఫోర్స్ దాడులతో వెలుగులోకి
  • కిందిస్థాయిలో కనీసం పట్టించుకోని ఆఫీసర్లు
  • కిందటేడాది 10 లక్షల ఎకరాల్లో నిషేధిత పత్తి సాగు
  • గ్లైఫోసేట్​తో నేలకు, రైతులకు ముప్పు

హైదరాబాద్‌, వెలుగు: నిషేధిత కలుపు మందు అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. భూసారాన్నిదెబ్బతీసే, రైతుల ఆరోగ్యానికి హాని కలిగించే గ్లైఫోసేట్ మందుపై నిషేధం ఉన్నా.. గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు సాగుతున్నాయి. కల్తీ విత్తనాలు పెరగడమే ఇందుకు ముఖ్య కారణమని తెలుస్తోంది. ఈ మధ్య అగ్రిటాస్క్‌ ఫోర్స్‌ చేసిన దాడుల్లో రూ.5 కోట్ల విలువైన 11,835 క్వింటాళ్ల కల్తీ విత్తనాలు దొరికాయి.గ్లైఫోసేట్‌ అమ్మకాలు భారీగా జరుగుతున్నట్లు ఈ సోదాల్లో తేలింది.

చాలా చోట్ల కల్తీ విత్తనాలు

ఈ మధ్య అగ్రిటాస్క్‌ ఫోర్స్‌ 74 షాపులపై దాడులు చేసి.. 96 శాంపిల్స్‌ సేకరించింది. మేడ్చల్‌లో 15 ఔట్‌లెట్లపై దాడులు చేయగా 21 శాంపిల్స్‌ కల్తీవి అని తేలింది. తర్వాత మంచిర్యాల, మహబూబ్‌నగర్‌లలో 18 శాంపిల్స్‌ కూడా కల్తీవి ఉన్నట్లు తేల్చారు. ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, సంగారెడ్డి జిల్లాల్లో కూడా కల్తీ విత్తనాలు వెలుగు చూశాయి. మొత్తంగా రూ.5 కోట్ల విలువైన 11,835 క్వింటాల్ కల్తీ విత్తనాలు సీజ్‌ చేశారు. ఇందులో అత్యధికంగా 10,705.53 క్వింటాళ్లు పత్తి విత్తనాలే కావడం గమనార్హం. అలాగే రూ.6.64 లక్షల విలువైన 78 లీటర్ల గ్లైఫోసేట్ కెమికల్స్ బయటపడ్డాయి. ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనే అత్యధికంగా పట్టుబడ్డాయి. ఈ కేసులకు సంబంధించి 113 మందిని అరెస్టు చేశారు. 6 ఫర్టిలైజర్‌ షాపుల లైసెన్స్‌లు రద్దు చేశారు.

కలుపు మందు అక్రమ దందా

కలుపు మందు పేరుతో కొందరు అక్రమార్కులు గ్లైఫోసేట్ సేల్స్ చేస్తున్నారు. రైతులు కలుపు తీసే అవసరం ఉండదనే ఆలోచనలో దళారులను నమ్మి గ్లైఫోసేట్‌ మందు వాడుతున్నరు. కిందిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ దందా కొనసాగుతోంది. కేన్సర్‌ కారకమని ప్రపంచవ్యాప్తంగా గ్లైఫోసేట్‌ మందులను నిషేధించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య నిషేధం విధించింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించే ముఠాలు భారీగా సేల్స్ చేస్తున్నాయి. నిషేధిత జాబితాలోని బీజీ3, హెచ్‌టీ పత్తి సాగు చేసిన వాళ్లు గ్లైఫోసేట్ వాడుతున్నారు.

పక్క రాష్ర్టాల నుంచే కల్తీ విత్తనాలు

ఈ ఏడాది షరతుల సాగులో భాగంగా ప్రభుత్వం 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని భావించింది. తర్వాత 60.33 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని టార్గెట్‌ పెట్టుకుంది. అయితే మార్కెట్‌లో అవసరానికి సరిపడా విత్తనాలు లేవు. దీంతో వ్యాపారులు మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ల నుంచి దిగుమతి చేసుకుని కల్తీ విత్తనాలు జోరుగా విక్రయించారు. లాస్ట్‌ ఇయర్‌లో వేసిన పత్తిలోనే 10 లక్షల ఎకరాల్లో నిషేధిత పత్తి (బీజీ3, హెచ్‌టీ) సాగైనట్లు తెలుస్తోంది. ఈసారి మరింతగా సాగు చేయనున్న నేపథ్యంలో రైతులు నిషేధిత పత్తిని ఎక్కువగా వేస్తున్నారు. కూలీల కొరత, ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు రైతులు సైతం వీటి సాగుకు మొగ్గుచూపిన నేపథ్యంలో గ్లైఫోసేట్‌ వాడకం మరింత పెరగనుందని తెలుస్తోంది.

గ్లైఫోసేట్ ఇదీ ప్రమాదం..

గ్లైఫోసేట్‌ ఫార్ములాతో రాష్ట్రంలో 20 రకాలకుపైగా కలుపు మందులు మార్కెట్ లో దొరుకుతున్నాయి. అవగాహన లేక రైతులు ఈ మందును వాడుతున్నారు. ఫలితంగా భూసారంతోపాటు రైతుల ఆరోగ్యం దెబ్బతింటోంది. పంటలు విషపూరితంగా మారుతున్నాయి. ఈ కలుపు మందుతో భూమిలో సారం తగ్గిపోతుంది. వానపాములు, ఫ్రెండ్లీ ఇన్‌సెక్ట్స్‌, ఇతర పురుగులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. పంటలపై స్ప్రే చేసే రైతుల ఊపిరితిత్తుల్లోకి మందు వెళ్లి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కేన్సర్‌, టీబీ వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. పదేళ్ల కిందట దేశవ్యాప్తంగా గ్లైఫోసేట్ సేల్స్ 500 టన్నులు లోపే ఉండేవి. బీజీ3, హెచ్‌టీ రకాలు వచ్చిన తర్వాత ఇవి రెట్టింపు అయ్యాయి. గ్లైఫోసేట్ వచ్చాక తక్కువ ప్రభావం ఉన్న ఇతర కలుపు మందులు 22 శాతం పడిపోయాయి. గ్లైఫోసేట్‌ స్ప్రే చేస్తే మందు అవశేషాలు ఆర్నెళ్ల వరకు భూమిలో ఉంటాయి.

Tagged market, sold, Despite, fertilizer, ban, Glyphosate

Latest Videos

Subscribe Now

More News