- నిర్మాణంతో కూడిన ఖాళీ స్థలం ఉన్న జాగాలకు ఓకే
- క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
- నెల రోజుల్లో పరిష్కరించాలన్న మంత్రి పొంగులేటి
- ఇప్పటి వరకు 22ఏలో ఏడు సమస్యల పరిష్కారం
- అర్హులందరికీ న్యాయం చేస్తామని మంత్రి హామీ
హైదరాబాద్, వెలుగు: జీవో 59 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటి నిర్మాణంతో కూడిన 500 చదరపు గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నింటినీ నెల రోజుల్లోగా పరిష్కరించేందుకు నిర్ణయించింది. ఈ అంశంపై సెక్రటేరియెట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతుతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
అసెంబ్లీలో 22-ఏ సమస్యల పరిష్కారంపై సీఎం ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. గతంలో జారీ చేసిన జీవోలు 14, 22, 29, 41కి అనుగుణంగా మెమో నంబర్ 48030ని విడుదల చేస్తూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు పంపినట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో అపరిష్కృతంగా ఉండిపోయిన చిన్న చిన్న ఇండ్ల స్థలాల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన కొలిక్కి తెచ్చేందుకే ఈ గడువు విధించినట్టు తెలిపారు. 22-ఏ వివాదాల పరిష్కార క్రమంలో భాగంగా ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన ఏడో కీలక ఉత్తర్వు అని మంత్రి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నిబంధనల ప్రకారం న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గత పాలకుల హయాంలో జీవో 59 అమలులో అడ్డగోలు అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరగడం వల్లే ఈ ప్రక్రియ నిలిచిపోయిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిశీలనలో భూమి అసలు రికార్డులు, దరఖాస్తుదారుల వాస్తవ అర్హత, క్రమబద్ధీకరించాల్సిన స్థలం విస్తీర్ణాన్ని పక్కాగా తనిఖీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటికే జారీ అయిన కన్వేయన్స్ డీడ్స్ కేసులను సైతం నిశితంగా పరిశీలించి, ఎక్కడా చిన్నపాటి పొరపాటుకు కూడా తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అక్రమాలు జరిగినట్టు తేలితే ప్రస్తుత రూల్స్ ప్రకారం సమీక్ష జరపాలని కలెక్టర్లకు సూచించించారు. అదే సమయంలో న్యాయస్థానాల పరిధిలో ఉన్న దరఖాస్తులు, వివాదాస్పద భూముల విషయంలో కోర్టుల తుది తీర్పులకు లోబడి మాత్రమే నడుచుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన పేదలకు మేలు చేస్తూనే, అక్రమార్కులు లబ్ధి పొందకుండా చూసుకోవాలన్నారు.
లక్షల్లో దరఖాస్తులు.. కోట్లలో రాబడి !
రాష్ట్రంలో ప్రభుత్వ, యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో 58, 59ల కింద గతంలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. 2014 డిసెంబర్ 30న జారీ చేసిన నిబంధనల ప్రకారం.. పేదలకు ఉచితంగా పట్టాలిచ్చే జీవో 58 కింద 3.44 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 1.25 లక్షల మందికి సర్కారు పట్టా సర్టిఫికెట్లు జారీ చేసింది.
అభ్యంతరం లేని స్థలాల రెగ్యులరైజేషన్ కోసం తెచ్చిన జీవో 59 కింద 29,486 అప్లికేషన్లు అందగా.. 17,829 మందికి కన్వేయన్స్ డీడ్స్ అందజేసి, ఫీజుల రూపంలో రూ. 420 కోట్లను ఖజానాకు రాబట్టింది. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 14న జీవో 14 విడుదల చేస్తూ.. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థల భూములతో పాటు యూఎల్సీ స్థలాలకూ వర్తించేలా పరిధిని విస్తరించి, మీసేవ ద్వారా దరఖాస్తుల గడువును పొడిగించారు. ఈ రెండో విడతలో జీవో 58 కింద 1.18 లక్షల దరఖాస్తులు రాగా, మొబైల్ యాప్ ద్వారా ఫీల్డ్ ఎంక్వైరీ పూర్తి చేసి ఇప్పటివరకు 20,527 మందికి
అసైన్‌మెంట్ పట్టాల విడుదలకు ఆమోదం తెలిపారు. ఇక జీవో 59 కింద వచ్చిన 85,546 దరఖాస్తుల్లోనూ మొబైల్ విచారణ ముగించి.. ఇప్పటిదాకా 17,485 అప్లికేషన్లను అప్రూవ్ చేయడంతో పాటు క్రమబద్ధీకరణ రుసుముల కింద రూ. 20.12 కోట్లను వసూలు చేశారు.
ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కారం..
నిషేధిత జాబితాతో ముడిపడి ఉన్న 10 నుంచి 12 రకాల సంక్లిష్ట సమస్యలను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఇప్పటికే జీవో 118, జీవో 76కు అనుగుణంగా స్పష్టమైన మెమోలు ఇచ్చి క్షేత్రస్థాయి ప్రతిష్టంభనను తొలగించామన్నారు. 22-ఏ జాబితాలో చిక్కుకుపోయినప్పటికీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీతో పాటు మున్సిపల్ అనుమతులు కలిగిన ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు సైతం ఇప్పటికే అనుమతులు మంజూరు చేసినట్టు తెలిపారు.
వీటికి తోడు సంవత్సరాల తరబడి నలుగుతున్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) దరఖాస్తుల క్లియరెన్స్‌తో పాటు నాలా ప్రక్రియ పూర్తి కాని పట్టాభూముల సమస్యలనూ శాశ్వతంగా పరిష్కరించామని గుర్తుచేశారు. తాజాగా జీవో 59 పరిష్కారంతో రిజిస్ట్రేషన్ల రంగంలో నెలకొన్న ప్రధాన అవరోధాలన్నీ క్రమంగా తొలగిపోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటనూ తూచ తప్పకుండా క్షేత్రస్థాయిలో అమలుచేస్తున్నామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలు తమ సొంత స్థలాల రిజిస్ట్రేషన్ల కోసం ఏండ్ల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో సామాన్యులకు రెవెన్యూ సేవలు సులభంగా, పారదర్శకంగా అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
