గ్యాంగ్ స్టర్ రిలీజ్.. సంబరాల్లో జైలు వార్డెన్..సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

గ్యాంగ్ స్టర్ రిలీజ్.. సంబరాల్లో జైలు వార్డెన్..సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

పణజి: జైలు నుంచి ఓ గ్యాంగ్​స్టర్ విడుదలయ్యాడు.. దీంతో గ్యాంగ్​స్టర్ అనుచరులు జైలు వద్దే సంబరాలు జరుపుకున్నారు. డ్యాన్సులు చేస్తూ తమ లీడర్​ను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సంబరాల్లో జైలు వార్డెన్ కూడా పాల్గొన్నాడు. గోవా సెంట్రల్ జైలు ముందు చోటుచేసుకుందీ ఘటన. గ్యాంగ్​స్టర్ అమోఘ్ నాయక్ జైలు ప్రధాన గేట్ నుంచి బయటకు రావడంతోనే అనుచరులు చుట్టుముట్టి నినాదాలు చేస్తూ , పటాకులు కాలుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. 

ఈ సంబరాల్లో వార్డెన్  లక్ష్మన్​ పడ్లోస్కర్  గ్యాంగ్​స్టర్ అనుచరులపై లిక్కర్ చల్లడం, తర్వాత గ్యాంగ్​స్టర్ అమోఘ్ నాయక్ భుజాలపై ఫొటోలకు ఫోజులిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో వార్డెన్ లక్ష్మణ్​పై విమర్శలు వెల్లువెత్తాయి. సంబరాల వీడియో ఉన్నతాధికారులకు చేరడంతో విచారణకు ఆదేశించారు. ప్రాథమిక దర్యాఫ్తులో ఆ సంబరాలు నిజమేనని తేలడంతో వార్డెన్ లక్ష్మన్​ పడ్లోస్కర్​ను సస్పెండ్ చేశారు.