గోవా టు హైదరాబాద్ డ్రగ్స్ సప్లయ్

గోవా టు హైదరాబాద్ డ్రగ్స్ సప్లయ్
  • నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్
  • 32 గ్రాముల కొకైన్ స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు : డ్రగ్స్​కు బానిసైన ఓ వ్యక్తి గోవా నుంచి సిటీకి కొకైన్ తీసుకొచ్చి ఐటీ కారిడార్​లో అమ్ముతుండగా మాదాపూర్ జోన్ ఎస్​వోటీ పోలీసులు పట్టుకున్నారు. అతడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమండ్రికి చెందిన బి. వీరరాజు(29) హఫీజ్ పేటలో ఉంటూ కార్ సేల్స్ బిజినెస్ చేస్తున్నాడు. డ్రగ్స్ కు బానిసైన వీరరాజు రెగ్యులర్​గా గోవాకు వెళ్లేవాడు. అక్కడ డ్రగ్స్ ను తీసుకునేవాడు. దీంతో పాటు గోవాలోని డ్రగ్స్ పెడ్లర్ల నుంచి కొకైన్​ను కొని సిటీకి తీసుకొచ్చి అమ్మేవాడు. మణికొండకు చెందిన వెడ్డింగ్ ప్లానర్ రాజేశ్ గోపిశెట్టి(38)తో కలిసి వీరరాజు ఐటీ కారిడార్​లో కొకైన్ అమ్ముతున్నాడు.

మణికొండకు చెందిన వ్యాపారి, డ్రగ్స్ కన్జ్యూమర్ క్రాంతికుమార్(45)ను ఇటీవల అదుపులోకి తీసుకున్న ఎస్​వోటీ పోలీసులు అతడిని విచారించారు. మణికొండకు చెందిన ఐటీ ఎంప్లాయ్ నరేశ్​గోపిశెట్టి(36) దగ్గర తాను కొకైన్ కొన్నట్లు క్రాంతికుమార్ పోలీసులకు చెప్పాడు. నరేశ్​ను అదుపులోకి తీసుకున్న ఎస్ వోటీ పోలీసులు అతడిని విచారించారు. నరేశ్​అన్న రాజేశ్ గోపిశెట్టిని అదుపులోకి తీసుకుని అతడిచ్చిన సమాచారంతో డ్రగ్ పెడ్లర్ వీరరాజును పట్టుకున్నారు. ఈ నలుగురిని అరెస్ట్ చేసి వీరి నుంచి 32 గ్రాముల కొకైన్, 2 కార్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.