ఉగ్రరూపం దాల్చిన గోదావరి

ఉగ్రరూపం దాల్చిన గోదావరి

వరంగల్, వెలుగు: ఇరాం లేని వానలకు గోదారి ఉగ్రరూపం దాల్చింది. ఎన్నడూ లేని విధంగా భారీగా వరద పోటెత్తింది. ఉమ్మడి జిల్లాలోని గోదావరి పరివాహక గ్రామాలన్నీ నీట మునిగాయి. వందలాది గ్రామాలు, కాలనీలు జలమయం అయ్యాయి. 1986లో గోదారికి 28లక్షల క్యూసెక్కుల వరద రాగా.. అంతకుమించి గురువారం 28.58లక్షల క్యూసెక్కుల వరద నమోదైంది. దీంతో ఆఫీసర్లు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు పునరావాస కేంద్రాలకు తరలించారు. కాళేశ్వరం మోటార్లు నీటిలో మునిగిపోవడంతో రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదిలా ఉండగా.. ఎడతెరపి లేని వర్షాలకు రోడ్లు తెగిపోయి, చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులన్నీ నిండి, మత్తడి పోస్తున్నాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వెయ్యికి పైగా ఇండ్లు, గోడలు కూలిపోయాయి. కరెంట్ లైన్లు తెగి, వందల గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి, వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.