ఐటీ సోదాల వెనుక గోదావరి- కృష్ణా లింక్?

ఐటీ సోదాల వెనుక గోదావరి- కృష్ణా లింక్?

 లింక్​పై రెండు రాష్ట్రాల మధ్య చర్చలు
ప్రధానికి డీపీఆర్​లు​ ఇచ్చిన ఇద్దరు సీఎంలు
రెండు డీపీఆర్​లు ఒకేరీతిన ఉన్నట్టు గుర్తించిన పీఎంవో
ఈ నేపథ్యంలోనే సోదాలు జరుగుతున్నట్టు ప్రచారం
రాజకీయ వర్గాల్లో హాట్
టాపిక్​గా మారిన తనిఖీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ సోదాలకు గోదావరి, కృష్ణా లింక్​కు సంబంధం​ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలోనూ, రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ఇదే అంశం హాట్ టాపిక్​గా మారింది. గోదావరి నీటిని కృష్ణాకు తరలించి, రాయలసీమకు అందించే ప్రణాళికలపై కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్​ ఇప్పటికే రెండుసార్లు ఈ విషయంపై ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరిగేషన్​ విభాగాల అధికారులు సైతం గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తీసుకెళ్లే రూట్​ మ్యాప్​లు, అంచనా వ్యయంపై వివిధ ప్రతిపాదనలను రూపొందించారు. రూ.లక్ష కోట్లకు పైగా వ్యయంతో కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త ప్రాజెక్టుపైనా అంతే ఆసక్తి కనబరుస్తోంది. రాయలసీమకు గోదావరి నీళ్లను అందించేందుకు ఇదే సరైన మార్గమని ఏపీ ప్రభుత్వం చొరవ చూపుతోంది.

ఇటీవల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేర్వేరుగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలవటం తెలిసిందే. ప్రధానితో భేటీ సందర్భంగా రెండు రాష్ట్రాల సీఎంలు గోదావరి, కృష్ణా లింక్​ ప్రాజెక్టు డీపీఆర్​ను ప్రధానికి సమర్పించారు. భారీ నిధులతో చేపట్టే ప్రాజెక్టు కావటంతో కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. కానీ, రెండు రాష్ట్రాల సీఎంలు ఇచ్చిన డీపీఆర్​ ఒకే తీరుగా ఉండటంతో ప్రధాని కార్యాలయం ఈ ప్రాజెక్టు లోతుపాతులను ఆరా తీసింది. ఒకే తీరుగా డీపీఆర్​లు ఉండటం, ఒకే కన్సల్టెన్సీ కంపెనీ వీటిని తయారు చేయటంతోపాటు దాదాపు రూ.60 వేల కోట్ల ప్రాజెక్టును ఒకే కాంట్రాక్టర్​కు కట్టబెట్టేలా వీటిని రూపొందించినట్లుగా పీఎంవో గుర్తించింది. ఇదే విషయాన్ని ప్రధానికి నివేదించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టిన కంపెనీలు, కాంట్రాక్టర్లపై కేంద్ర ఐటీ శాఖ నజరేసిందని..
అందులో భాగంగానే ఇటీవల ఐటీ సోదాలు జరిగాయని ప్రచారం జరుగుతోంది.