గోదావరి డేంజర్ బెల్స్.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

గోదావరి డేంజర్ బెల్స్.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం/భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: గోదావరి డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్నది. భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం నుంచి నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. రాత్రికి ప్రవాహం 53 అడుగులు దాటడంతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక అల.. మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రతి పునరావాస కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. తీర ప్రాంతంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. వాగులు, నదుల వద్దకు సెల్ఫీలు, ఫొటోలు దిగడానికి వెళ్లొద్దని యువతకు సూచించారు. భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలపై నిషేధాజ్ఞలు విధించారు. మరోవైపు ఎగువన ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా 15.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో 58 అడుగులకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 30 గ్రామాల్లో 1,593 కుటుంబాలకు చెందిన 4,987 మందిని 22 పునరావాస కేంద్రాలకు తరలించారు. ములుగు జిల్లాలోని 467 కుటుంబాలను వెంకటాపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు షిఫ్టు చేశారు.


ఏపీ విలీన మండలాల్లో నరకం
కొత్తగూడెం జిల్లాలో 9 చోట్ల రోడ్లు నీట మునిగి ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రాలో విలీనమైన భద్రాచలం ఏజెన్సీ మండలాలు కూనవరం, వీఆర్​పురం, చింతూరులలో దాదాపు పది రోజులుగా ప్రజలు నరకం చూస్తున్నారు. వీఆర్​పురం మండలం చినమట్టపల్లి గ్రామానికి చెందిన పులి రాములమ్మ అనే గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతుండటంతో పడవపై కూనవరంలోని కోతులగుట్ట పునరావాస కేంద్రానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఎటపాక మండలం రాయనపేట వద్ద వంతెనపై నీరు అంచనా వేయడంలో విఫలమై ఓ కారు నీటమునిగింది. అందులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కారును స్థానికులు బయటకు తీశారు.

మేడిగడ్డ వద్ద 13.5 లక్షల క్యూసెక్కులు
కాళేశ్వరం దగ్గర పుష్కరఘాట్‌‌‌‌ మెట్ల పైనుంచి గోదావరి ప్రవహిస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద గంట గంటకు ఇన్ ఫ్లో పెరుగుతున్నది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు 6.5 లక్షల క్యూసెక్కులుగా ఉన్న వరద శుక్రవారం మధ్యాహ్నం నాటికి13.5 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో బ్యారేజీకి అమర్చిన మొత్తం 85 గేట్లను తెరిచి వరదను దిగువకు పంపిస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గురువారం సాయంత్రం 6 గంటలకు 13.2 మీటర్లుగా ఉన్న ప్రవాహం శుక్రవారం ఉదయం 15.8 మీటర్లు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 17.3 మీటర్లకు వరద చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. టేకులగూడెం గ్రామం వద్ద -తెలంగాణ ‒ చత్తీస్‌‌గఢ్‌‌ మధ్యన 163వ జాతీయ రహదారిపైకి నీళ్లు రావడంతో రాకపోకలను నిలిపివేశారు. ఇదే రోడ్డుపై వాజేడు మండలం మండపాక - జగన్నాధపురం గ్రామాల మధ్య ఉన్న రెండో వంతెన అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది.