ప్రాజెక్టులన్నీ ఫుల్ .. ఎగువన వర్షాలతో గోదావరి పరవళ్లు

ప్రాజెక్టులన్నీ ఫుల్ .. ఎగువన వర్షాలతో గోదావరి పరవళ్లు
  • పూర్తిగా నిండిన శ్రీరాంసాగర్, 
  • ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు
  • మూడ్రోజుల్లో ఎస్సారెస్పీకి 25 టీఎంసీలు
  •  38 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల 
  • భద్రాచలం వద్ద పెరిగిన వరద ఉధృతి
  • కృష్ణా ప్రాజెక్టులకూ కొనసాగుతున్న ఇన్ ఫ్లో


హైదరాబాద్/నిజామాబాద్​/బాల్కొండ​, వెలుగు: ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టులు జులైలోనే నిండినా.. గోదావరి బేసిన్  ప్రాజెక్టులపైనే కొంచెం సందేహాలు ఏర్పడ్డాయి. కానీ, ప్రస్తుతం ఎగువన మహారాష్ట్రలోని గోదావరి పరీవాహకంతో పాటు స్థానికంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండాయి. 

రెండు మూడు రోజుల క్రితం వరకు వెలవెలబోయిన గోదావరి ప్రాజెక్టులు.. ఇప్పుడు మత్తళ్లు దుంకుతున్నాయి. శ్రీరాం సాగర్, కడెం, ఎల్లంపల్లి, నిజాం సాగర్, సింగూరు ప్రాజెక్టులు నిండడంతో ఆయా ప్రాజెక్టుల గేట్లను ఎత్తారు. ప్రస్తుతం శ్రీరాం సాగర్  ప్రాజెక్టుకు 1.20 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 2.20 లక్షల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు రోజుల్లోనే ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం విశేషం. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 80 టీఎంసీలకుగానూ 73 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మరో ముఖ్యమైన ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ 20 టీఎంసీలకుగానూ 16 టీఎంసీలు మెయింటెన్​ చేస్తూ దిగువకు నీరు వదులుతున్నాయి. గాయత్రి పంప్ హౌస్  ద్వారా నీటిని ఎత్తిపోస్తూ మిడ్​మానేరుకు తరలిస్తున్నారు.

ఎస్సారెస్పీకి మూడురోజుల్లోనే 25టీఎంసీలు.. 

ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి గడిచిన మూడు రోజుల్లో 25 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి కెపాసిటీ 90 టీఎంసీలుకాగా 15వ తేదీన 47 టీఎంసీలున్న నీరు 16న 50 టీఎంసీలకు, 17న 68 టీఎంసీలకు, 18న 73 టీఎంసీలకు చేరింది. ఎగువ గోదావరి నుంచి భారీగా వరద పోటెత్తడంతో ఇంజినీర్లు సోమవారం ప్రాజెక్టు రెగ్యులేషన్  ప్రారంభించారు. ఇన్​ఫ్లో ఆధారంగా బయటకు నీరు వదులుతున్నారు. ఎస్పారెస్పీకి మొత్తం 42 ఫ్లడ్ గేట్లుండగా ఉదయం 9 గంటలకు తొమ్మిది గేట్లు ఓపెన్ చేసి 25 వేల క్యూసెక్కులను మొదట వదిలిన ఇంజినీర్లు.. క్రమంగా 39  గేట్ల వరకు ఎత్తి 1,51,257 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. రాత్రి 10 గంటలకు 34 గేట్లు ఓపెన్  చేసి అదే లెవెల్  నీటిని వదులుతున్నారు. కాగా, ప్రాజెక్టు గేట్లు ఎత్తినందున  తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఈ శ్రీనివాసరావు గుప్తా సూచించారు. మరోవైపు ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా 18వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 4,700 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3,300 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు దిగువ జల విద్యుత్ కేంద్రంలోని నాలుగు టర్బైన్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుత్  ఉత్పత్తి చేస్తున్నామని డీఈ శ్రీనివాస్  తెలిపారు.  

‘ఎల్లంపల్లి’లో 32 గేట్లు ఖుల్లా

కడెం, శ్రీరాంసాగర్​ గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం ప్రాజెక్టు 32 గేట్లు ఓపెన్​ చేసి గోదావరిలోకి వదిలిపెడుతున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఎనిమిది గేట్ల ద్వారా 43 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయగా, గంటగంటకూ ప్రాజెక్ట్​లోకి వరద పెరగడంతో మధ్యాహ్నం 2.15 గంటలకు 32 గేట్లు ఎత్తి 2,20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సాయంత్రం 6 గంటలకు  1,66,000 క్యూసెక్కులకు తగ్గించారు. ఎల్లంపల్లి నుంచి సుందిళ్ల (పార్వతి) బ్యారేజీకి వరద పోటెత్తడంతో 74 గేట్ల ద్వారా వచ్చిన నీరును వచ్చినట్టు కిందికి వదులుతున్నారు. మత్స్యకారులతో పాటు గోదావరిలో ఎవరూ స్నానాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి..

భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకూ పెరుగుతోంది. భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి కారణంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 38 అడుగులకు చేరింది. స్నానఘట్టాలను తాకుతూ 7.20 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. మరోవైపు ఎగువన తాలిపేరు ప్రాజెక్టు ఇన్​ఫ్లో పెరగడంతో 10 గేట్లను ఎత్తి 24వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. 

కృష్ణాకు కొనసాగుతున్న వరద..

కృష్ణా ప్రాజెక్టుల్లోకి యథావిధిగా వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా ఆల్మట్టి, నారాయణపూర్  నుంచి వరద తగ్గినా.. ఇప్పుడు మహారాష్ట్రలో అతిభారీ వర్షాలు పడుతుండడంతో మళ్లీ వరద మొదలైంది. ఇటు జూరాల, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతున్నది. జూరాలకు 2 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు 3 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద వస్తున్నది. వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు.