భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి.. మొదటి  ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి.. మొదటి  ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం:  భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదకు తోడుగా స్థానికంగా 3 రోజులుగా ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వరద పరవళ్లు తొక్కుతోంది. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో నీటిమట్టం 43 .5 అడుగులకు చేరుకుంది. మెదటి ప్రమాద హెచ్చరిక సూచీ అయిన 43 అడుగులకు చేరుకున్నకాసేపటికే మరో అరడుగు పెరగడంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు.

              మోటారు బోట్లు, స్పీడ్ బోట్లు.. స్టీమర్లతో గోదావరి నదిలో ప్రయాణించవద్దని.. అలాగే వరద నీటిలో ఈతకు.. స్నానాలకు వెళ్లడం చేయరాదంటూ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భద్రాచలం వద్ద స్నానపు ఘాట్లను వరదనీరు ముంచెత్తడంతో ఎవరూ ఇటు వైపు రావద్దంటూ దూరం నుండే వెనక్కి పంపుతున్నారు. ముంపు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను పంపింది విపత్తుల నిర్వహణ శాఖ.