గోదావరి నది ఉగ్రరూపం.. క్షణం క్షణం ఉత్కంఠ

గోదావరి నది ఉగ్రరూపం.. క్షణం క్షణం ఉత్కంఠ

వరుణుడు, గోదారమ్మ శాంతించు అంటూ మహిళలు పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి నది మహోగ్రరూపానికి కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వేలాది మంది నిరాశ్రులయ్యారు. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలో వరద తీవ్రత అధికంగా ఉంది. పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. చుట్టూ నీళ్లతో గ్రామాలు ద్వీపాలను తలపిస్తున్నాయి. ఏమవుతోందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పునారావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని మండిపడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

నీరు చేరడంతో ఇంట్లో ఉన్న సామాగ్రీ మొత్తం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్లు, బైక్ లు నీట మునిగిపోయాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో  గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోదావరిఖని - మంచిర్యాల దారిలోని బ్రిడ్జిపై వరద నీరు చేరింది. గోదావరిఖని గంగానగర్ దగ్గర ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. మంచిర్యాల- గోదావరిఖని మధ్య  రాకపోకలు నిలిచిపోయాయి. గంగానగర్ లో చెక్ పోస్టు ఏర్పాటు చేసి...బస్టాండ్ సమీపంలోనే వాహనాలు నిలిపివేస్తున్నారు. మండలాలకు, జిల్లాలకు రవాణా స్తంభించిపోయింది. వేలాది ఎకరాల పంట నీట మునిగిపోయింది. మొదటి దశలో ఉన్న పత్తి మొక్కలు, వరి పంటలు వరదలకు దెబ్బతిన్నాయి.