కృష్ణా, గోదావరి బేసిన్​లోని అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద

కృష్ణా, గోదావరి బేసిన్​లోని అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద
  • 60 శాతం నిండిన ఆల్మట్టి
  • తుంగభద్రకు భారీ వరద, గోదావరి ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్​ఫ్లో
  • కడెం నుంచి తుపాకులగూడెందాకా అన్ని గేట్లు ఓపెన్

హైదరాబాద్/గద్వాల, వెలుగు: ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్న వానలతో కృష్ణా, గోదావరి బేసిన్​లోని అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. కర్నాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు మంగళవారం ఉదయానికే 60 శాతం నిండింది. 129.72 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఈ ప్రాజెక్టులో 74.22 టీఎంసీల నీళ్లు చేరాయి. బుధవారానికి ఈ ప్రాజెక్టు మూడు వంతులు నిండనుంది. ఆల్మట్టిలోకి 1.16 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. తుంగభద్రకు 72 వేల క్యూసెక్కులు, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి 9 వేల క్యూసెక్కుల చొప్పున ప్రవాహం వస్తోంది. గోదావరి బేసిన్​లో కడెం నుంచి సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టులు, బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని నదిలోకి వదిలేస్తున్నారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా ఇప్పటివరకు 65 టీఎంసీల నీళ్లు చేరాయి. ఈ ప్రాజెక్టు లోకి 40 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. మేడిగడ్డ వద్ద 5.72 లక్షల క్యూసెక్కులు, తుపాకులగూడెం దగ్గర 7.29, దుమ్ముగూడానికి 7.55 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. గోదావరి బేసిన్ లో భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాచలం దగ్గర మళ్లీ నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జూరాలకు స్వల్ప వరద

ప్రియదర్శని జూరాల ప్రాజెక్టుకు భీమ నది నుంచి మంగళవారం స్వల్పంగా వరద ప్రారంభమైంది. కర్ణాటకలోని చిత్తాపూర్ తాలూకా భీమానది పై ఉన్న సనత్ బ్యారేజ్ నుంచి 7 వేల క్యూసెక్కుల నీరు జూరాలకు వస్తున్నది. వర్షాల కారణంగా మరో 3 వేల క్యూసెక్కులు కలుపుకుని మొత్తంగా జూరాలకు 10 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు వద్ద వాటర్ లెవెల్ 318.01 ఉండగా.. నెట్టెంపాడు లిఫ్ట్ కు 750 క్యూసెక్కులు, బీమా లిఫ్టు-–1కి1300 క్యూసెక్కులు, బీమా లిఫ్టు–-2కి 750 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ కు 640 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.