తగ్గుముఖం పట్టిన గోదావరి..భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ

తగ్గుముఖం పట్టిన గోదావరి..భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ

భద్రాచలం, వెలుగు : ఎగువ ప్రాంతాలంలో వర్షాలు కాస్త తగ్గడంతో పట్టడంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. రెండు రోజుల కింద 48 అడుగుల వరకు చేరుకున్న వరద క్రమంగా తగ్గి సోమవారం రాత్రి వరకు 43 అడుగుల కంటే కిందకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. 

అయితే మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖహెచ్చరికలతో ఆఫీసర్లు అలర్ట్‌‌ అయ్యారు. మరోవైపు చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్ట్‌‌కు దండకారణ్యంలోని వాగుల నుంచి వరద వస్తుండటంతో 16 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 29,523 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.

శ్రీరాంసాగర్ కు తగ్గిన వరద

బాల్కొండ, వెలుగు : ఎగువ గోదావరి బేసిన్‌‌లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీరాంసాగర్‌‌ ప్రాజెక్ట్‌‌కు ఇన్‌‌ఫ్లో తగ్గింది. సోమవారం ఉదయం 3.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో రావడంతో గేట్లను ఓపెన్‌‌ చేసి 2.25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఇన్‌‌ఫ్లో 1.59 లక్షలకు తగ్గి ప్రస్తుతం నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌‌ 25 గేట్లను ఓపెన్‌‌ చేసి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

 ప్రాజెక్ట్‌‌లో ప్రస్తుతం 1090 అడుగులు (76.89 టీఎంసీల) నీరు నిల్వ ఉందని ఇరిగేషన్‌‌ ఆఫీసర్లు తెలిపారు. ప్రాజెక్ట్‌‌ నుంచి వరద కాల్వకు 18 వేల క్యూసెక్కులు, కాకతీయ కెనాల్‌‌కు 4,500, ఎస్కేప్‌‌ గేట్లకు 3,500, మిషన్‌‌ భగీరథ కోసం 231 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా, 622 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. జల విద్యుత్‌‌ కేంద్రంలో 36.43 మెగావాట్ల విద్యుత్‌‌ ఉత్పత్తి జరుగుతోందని జెన్‌‌కో డీఈ శ్రీనివాస్‌‌ తెలిపారు.