మేడారం జాతరలో మహాఘట్టం ఆవిష్కృతం అయ్యింది. జనవరి 29న వనదేవత సమ్మక్క తల్లి మేడారం గద్దెపైకి చేరింది. కుంకుమ భరణి సమ్మక్క ప్రతి రూపాన్ని పూజారులు గద్దెలపైకి తీసుకుని వచ్చారు. దారిపొడవునా అడుగడుగునా భక్తులు అమ్మవారికి మంగళహారతులతో స్వాగతం పలికారు. వన దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోయారు. లక్షలాది మందితో మేడారం జనసంద్రోహం అయ్యింది.
చిలుకల గుట్ట నుంచి కుంకుమ భరణి ప్రతి సమ్మక్క ప్రతి రూపాన్ని తీసుకొచ్చేముందు..ములుగు జిల్లా ఎస్పీ ఏకే 47 తో మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి సమ్మక్కకు అధికారికంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, , జిల్లా కలెక్టర్ దివాకర్ స్వాగతం పలికారు. గద్దెపైకి చేరే వరకు పోలీసులు నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
జనవరి 28న పగిడిద్దె రాజు, గోవిందరాజు, సారలమ్మ గద్దెపైకి చేరగా..ఇవాళ సమ్మక్క తల్లి గద్దెపైకి చేరింది. రేపు జనవరి 30న అమ్మవార్లు సమ్మక్క, సారక్క ఇద్దరూ గద్దెలపై కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 31న సాయంత్రం వారికి ఆవాహన పలికి తిరిగి వనప్రవేశం చేస్తారు.
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారక్క జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈ సారి అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కోట్లాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు 4వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
జాతర విశిష్టత
వనదేవతలైన సమ్మక్క, సారలమ్మ తల్లి-కూతుర్లు... తెలంగాణ ప్రాంతాన్ని కాకతీయ రాజులు సుమారు 700 సంవత్సరాలు పరిపాలించారు. సమ్మక్క సారలమ్మలు జగిత్యాల జిల్లా ప్రాంతానికి చెందిన గిరిజన జాతికి చెందినవారు. గిరిజనుల దొర మేడరాజు అడవిలో వేటాడుతుండగా.. ఒక పుట్టపై పులులు, సింహాలు కాపలాగా ఉన్న పసిపాప సమ్మక్కను చూసి.. ఆ పాపను తీసుకెళ్లి పెంచుకున్నాడని చరిత్ర ద్వారా తెలుస్తుంది.
అప్పటి వరకు కరువు.. కాటకాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు... సమ్మక్క రాకతో సమస్యలు తగ్గిపోయాయి. అంతేకాదు.. ఎలాంటి జబ్బునైనా ఆమె చేతి పసరుతో రోగాలు నయమయ్యాయని చెబుతుంటారు. యుక్తవయస్సు వచ్చిన తర్వాత సమ్మక్కను మేడారం పాలకుడు.... గిరిజన దొర... తన మేనల్లుడు అయిన పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరి దాంపత్య జీవనంలో సారలమ్మ, నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు కలిగారు. మేడరాజు పొలవాస ప్రాంతానికి కోయ రాజు కాగా... పగిడిద్ద రాజు మేడారాన్ని పాలించాడని చరిత్ర ఉంది.
కాకతీయులతో యుద్ధం, త్యాగాలు
కాకతీయ సామ్రాజ్యం విస్తరణలో భాగంగా, కాకతీయ మొదటి ప్రభువు మేడరాజు పాలించిన ప్రాంతాన్ని ఆక్రమించేందుకు దండెత్తాడు. ఈ దాడిని తట్టుకోలేక మేడరాజు తన కుమార్తె సమ్మక్క దగ్గర మేడారంలో ఆశ్రయం పొందుతాడు. పగిడిద్ద రాజు కాకతీయుల సామంతుడిగా ఉంటూ, వారికి ప్రతి నెలా కప్పం కట్టేవాడు. మూడు సంవత్సరాలుగా ఏర్పడిన కరువుల వల్ల కప్పం కట్టలేకపోవడం... మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడం వంటి కారణాలతో కాకతీయులు ఆగ్రహించి మేడారంపై దండెత్తారు. కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొనేంత బలం లేకపోయినా.. పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, వారి పిల్లలు సారలమ్మ, నాగులమ్మ, జంపన్నతో సహా కోయ ప్రజలంతా యుద్ధానికి సిద్ధమయ్యారు.
బలమైన ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులతో వచ్చిన కాకతీయ సైన్యంతో వందల సంఖ్యలో ఉన్న కోయ ప్రజలు బాణాలు, మొండి కత్తులతో భీకరంగా పోరాడారు. ఈ యుద్ధంలో పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ వీరమరణం పొందారు. కుటుంబ సభ్యుల మరణాలను చూసిన జంపన్న.. అవమానాన్ని భరించలేక పక్కనే ఉన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు.
తన కుటుంబ సభ్యులందరూ మరణించారని తెలిసిన సమ్మక్క, ఏమాత్రం వెనుకాడకుండా కాళీమాతలా విజృంభించి శత్రువులను ఎదుర్కొంది. అయితే, వెనుక నుంచి ఒక సైనికుడు దొంగచాటున పొడిచి సమ్మక్కను తీవ్రంగా గాయపరిచాడు. రక్తం కారుతుండగానే ఆమె చిలుకల గుట్ట వైపు వెళ్లి, నెమలినార చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర కుంకుమ భరిణెగా మారి అదృశ్యమైందని చెబుతుంటారు.
