- కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో 300 కోట్లతో ఏర్పాటు
- సీఎంతో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రతినిధి బృంధం భేటీ
- పూర్తి సహకారం అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్‌ను ఖమ్మం జిల్లాలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో సీఎం రేవంత్ రెడ్డితో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ వ్యవహారాలు) రాకేశ్ స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై సీఎంకు కంపెనీ ప్రతినిధులు సమగ్ర నివేదికను అందజేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో రూ.300 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ మెగా ప్రాజెక్టు ద్వారా దాదాపు 700 మందికి పైగా స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.
కొణిజర్లలో రోడ్డు విస్తరణకు సీఎం ఆదేశం..
ఖమ్మం జిల్లా గుబ్బగుర్తిలో గోద్రేజ్ అగ్రోవెట్ సం స్థకు ప్రభుత్వం ఇప్పటికే 113.5 ఎకరాల భూమిని కేటాయించగా, అక్కడ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లు, నర్సరీ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రంతో పాటు అధునాతన సీడ్ గార్డెన్‌ను నిర్మిస్తున్నారు. అయితే, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సీడ్ గార్డెన్ అభివృద్ధి కోసం అదనంగా మరో 35 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించాలని కంపెనీ ప్రతినిధులు ఈ భేటీలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు భారీ యంత్రాలు, రవాణా వాహనాల రాకపోకలకు వీలుగా ప్రాసెసింగ్ మిల్లుకు వెళ్లే ప్రధాన రహదారిని విస్తరించాలని కోరారు.
ఇందుకు సీఎం సానుకూలంగా స్పందిస్తూ.. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో తక్షణమే రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని, తద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని సీఎం స్పష్టం చేశారు. గోద్రేజ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ తెలంగాణలో సమీకృత కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల రైతులకు నాణ్యమైన విత్తనాలు, మార్కెటింగ్ సదుపాయం త్వరగా అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమల స్థాపనకు, సాగు విస్తరణకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు సీఎం హామీ ఇచ్చారు.
