పోస్ట్​లో దేవుళ్ల ప్రసాదాలు.. పైలట్ ప్రాజెక్టుగా 10 గుడులు

పోస్ట్​లో దేవుళ్ల ప్రసాదాలు.. పైలట్ ప్రాజెక్టుగా 10 గుడులు

పైలట్ ప్రాజెక్టుగా 10 గుడుల ఎంపిక.. తెలంగాణ ఎండోమెంట్‍ కసరత్తు

భద్రాచలం, వెలుగు: పోస్ట్​లో దేవుళ్ల ప్రసాదాలు భక్తులకు చేరవేసేలా తెలంగాణ ఎండోమెంట్‍ డిపార్ట్​మెంట్​కసరత్తు చేస్తోంది.  ఈ మేరకు రాష్ట్రంలోని పది టెంపుళ్లను పైలట్​ప్రాజెక్టుకు ఎంపిక చేసింది. భక్తులు ఆన్‍లైన్‍లో తమకు నచ్చిన గుడిలో పూజలకు రుసుం చెల్లిస్తే, వారి పేరిట పూజలు చేసి ప్రసాదాలను పోస్టు ద్వారా ఇంటికే పంపిస్తారు. ఏఏ ఆలయంలో ఎలాంటి పూజలు చేస్తారు, పూజ తర్వాత భక్తునికి పంపించే ప్రసాదాలు, వాటి క్వాంటిటీ, పూజల ధరలు తదితర వివరాలు ఒక ఫార్మెట్‍లో పంపించాలంటూ ఎండోమెంట్‍ కమిషనర్‍ అనిల్ కుమార్‍ ఎంపిక చేసిన 10 టెంపుళ్ల ఈవోలకు ఉత్తర్వులు జారీ చేశారు. వీరి నుంచి వచ్చిన వివరాలను పోస్టల్‍ డిపార్ట్​మెంట్‍కు పంపించి ఆ తర్వాత ఫైనల్‍ రేట్స్ డిసైడ్‍ చేస్తారు. గతంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణం తర్వాత తలంబ్రాలు పోస్టల్‍లో పంపించేవారు. ఏటా రూ. 40 లక్షలకు పైగా ఆదాయం భద్రాచలం దేవస్థానానికి వచ్చేది. ఇప్పుడు నిత్యం స్వామివారి ప్రసాదాలు భక్తుల ఇంటికే అందించేలా ఎండోమెంట్ డిపార్ట్​మెంట్ యాక్షన్‍ ప్లాన్‍ సిద్ధం చేస్తోంది. పైలట్‍ప్రాజెక్టుగా ఎంపిక చేసిన పది టెంపుళ్లలో తొలి దశలో ఈ స్కీం అమలు చేసి తర్వాత మిగిలిన అన్ని ఎండోమెంట్‍ పరిధిలోని టెంపుళ్లకు విస్తరించాలని నిర్ణయించారు.

భద్రాద్రిలో ఇలా..

భద్రాద్రిలో ముఖ్య నక్షత్రాల సమయంలో చేసే పూజలు, హోమాలు, ప్రభుత్వోత్సవం వంటి దర్బారు సేవను మినహాయించి అన్ని అర్చనలు, అభిషేకాలు ఆన్‍లైన్లో నిర్వహించేలా ఎండోమెంట్‍ కమిషనర్‍ అనిల్‍కుమార్ ఆదేశాల మేరకు డిజైన్‍ చేస్తున్నారు. సుప్రభాత, పవళింపు సేవలు కూడా ఇందులో ఉండవు. నిత్య అంతరాలయ అర్చన, ఆదివారం నిర్వహించే అభిషేకం, సువర్ణ పుష్పార్చన, శనివారం నాటి భద్రుని మండపంలో చేసే అభిషేకం, సువర్ణ తులసీ దళాల అర్చన, గోవిందరాజ, రంగనాయక, అభయాంజనేయ, యోగానంద లక్ష్మీనర్సింహస్వామి, లక్ష్మీతాయారు అమ్మవార్ల అభిషేకాలు, ధన్వంతరీ హోమం, సంధ్యాహారతి, నిత్య కల్యాణం, వెండి రథ సేవ, గోమాత పూజలు తదితర పూజలన్నీ ఆన్‍లైన్లో పెట్టేలా భద్రాచలం దేవస్థానం డిజైన్‍ చేసింది. వాటి ధరలు కూడా కమిషనర్‍ సూచించిన ఫార్మాట్లో పొందుపరిచింది. అయితే పూజను బట్టి ప్రసాదాలు ఉంటాయి. అన్ని పూజలకు ఒకే రకమైన ప్రసాదం ఉండదు. ప్రసాదంగా కుంకుమ, అక్షతలు, మిస్రీ(పటిక బెల్లం పలుకులు), జాకెట్‍, శాలువా ఉంటాయి. ఏ పూజకు ఏ ప్రసాదం ఇచ్చేది కూడా కమిషనర్‍కు పంపిన ఫార్మాట్‍లో ఇచ్చారు. ఎంపిక చేసిన పది టెంపుళ్ల నుంచి కూడా ఇదే తరహాలో ఫార్మాట్లు కమిషనర్‍ ఆఫీస్​కు వస్తాయి. అక్కడ వాటిని పరిశీలించి, పోస్టల్‍ చార్జెస్‍తో ఫైనల్‍ పూజ ధరను డిసైడ్‍ చేస్తారు. వీటన్నింటిని ఒక వెబ్‍సైట్‍లో పెట్టి, సెలక్ట్  చేసుకున్న టెంపుల్‍లో ఉన్న పూజల వివరాలు భక్తులకు అర్ధమయ్యే రీతిలో ఉంచుతారు. ఆ తర్వాత లాంఛనంగా స్కీంను ప్రారంభిస్తారు.

పది గుడులు ఇవే..

భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర, కొండగట్టు, కొమరెల్లి, ధర్మపురి, భద్రకాళీ, హైదరాబాదులోని గణేష్‍, మహంకాళీ టెంపుళ్లను పైలట్​ప్రాజెక్టకు ఎంపిక చేశారు. ఒక్కో టెంపుల్‍కు ఒక్కో ప్రత్యేకత ఉంది. కరోనా సమయంలో టెంపుల్స్ లో అనేక ఆంక్షలు విధించారు. సుదూర ప్రాంతాల నుంచి దర్శనానికి వెళ్తే  కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఆయా టెంపుల్స్ లో పూజలు నిర్వహించి అనంతరం భక్తుల ఇంటి వద్దకే ప్రసాదాలు పోస్టల్‍ డిపార్ట్​మెంట్ ద్వారా చేరవేయనున్నారు.  ఇందుకు టెంపుల్​ బ్యాంకు ఖాతా, ఐఎఫ్‍సీకోడ్‍ నంబర్లతోపాటు పూజలు, రుసుములు, పార్శిల్‍లో పెట్టే ప్రసాదాల బరువు తదితర వివరాలు సేకరిస్తున్నారు.

For More News..

ఎస్సై, సర్పంచ్ , ఉప సర్పంచ్​పై ఇసుక మాఫియా దాడి

ఫ్యామిలీ ప్లానింగ్‌‌పై బలవంతం చేయలేం

జీతాలియ్యట్లేదని ఐఫోన్ ఫ్యాక్టరీపై దాడి