
తెలంగాణ వ్యాప్తంగా చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఒంటరిగా వెళ్తున్న మహిళలను, వృద్దురాళ్లను టార్గెట్ గా చేసుకుని చైన్లు లాక్కెళ్ళుతున్నారు దొంగలు. కొందరు మాయమాటలు చెప్పి నమ్మించి బంగారు చైన్లు లాక్కెళ్తున్నారు. లేటెస్ట్ గా అక్టోబర్ 10న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలిని పెన్షన్ వచ్చిందని నమ్మించి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారంలో చోటు చేసుకుంది.
ధర్మారం మండల కేంద్రానికి చెందిన బుదారపు శంకరమ్మ(67) అక్టోబర్ 10న ఉదయం ధర్మారం మెయిన్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి వచ్చి పరిచయం చేసుకున్నాడు. నీకు రూ. 4000 రూపాయల పెన్షన్ మంజూరు అయ్యిందని ఫోటో అప్లోడ్ చేయాలని నమ్మించి వృద్ధురాలిని పక్కకు తీసుకెళ్లాడు. మెడలోని బంగారు పుస్తెల తాడు ఫోటోలో కనిపిస్తే పెన్షన్ రాదని చెప్పడంతో శంకరమ్మ తన పుస్తెల తాడు తీసి అతని చేతిలో పెట్టింది.
దీంతో ఒక్కసారిగా సదరు వ్యక్తి బంగారు పుస్తెల తాడు తీసుకుని పరారయ్యాడు. దీంతో లబోదిబోమంటూ మోసపోయిన వృద్ధురాలు ధర్మారం పోలీస్ స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేసింది. పోలీసులు అక్కడ ఉన్న మొబైల్ షాపులోని సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.