పోలీసులమని చెప్పి.. బురిడీ కొట్టించారు! మహిళ పుస్తెలతాడు కొట్టేసి పారిపోయిన దొంగలు

పోలీసులమని చెప్పి.. బురిడీ కొట్టించారు! మహిళ పుస్తెలతాడు కొట్టేసి పారిపోయిన దొంగలు

మహబూబ్ నగర్ టౌన్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన 

మహబూబ్​నగర్​ అర్బన్​, వెలుగు: ఇద్దరు దొంగలు తాము పోలీసులమని నమ్మించి మహిళను బురిడీ కొట్టించి  పుస్తెలతాడుతో పారిపోయిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ టౌన్ పరిధి లక్ష్మినగర్ కాలనీలో నివసించే మహిళ సుందరి గత మంగళవారం ఇంటి కరెంటు బిల్లు కట్టేందుకు మెట్టుగడ్డ సమీపంలోని ఆఫీస్ కు వెళ్లింది. బిల్లు కట్టి తిరిగివస్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమెను అడ్డగించారు. 

తాము పోలీసులమని చెప్పి నమ్మించి.. బంగారు ఆభరణాలు మెడలో వేసుకొని తిరగొద్దంటూ మాయమాటలు చెప్పారు. అనంతరం ఆమె మెడలోంచి 4.5 తులాల పుస్తెల తాడును తీయించి వేరే సంచిలో పెట్టినట్లు నటించారు. ఆ తర్వాత వేరే సంచిని ఇచ్చి బురిడీ కొట్టించి పరార్ అయ్యారు. ఇంటికి వెళ్లి చూడగా సంచిలో గులకరాళ్లు కనిపించడంతో బాధితురాలు లబోదిబోమంది. దీంతో బుధవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్​నగర్​రూరల్ సీఐ గాంధీ నాయక్ తెలిపారు.