
తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల ఉత్సవాలతో గోల్కొండ కోట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జగదాంబిక అమ్మవారికి జూన్ 26న తొలి బోనం సమర్పణతో ఉత్సవాలు ప్రారంభం కాగా, మొదటి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజామునుంచే పిల్లాజెల్లలతో కలిసి భక్తులు క్యూ కట్టారు.
అమ్మవారికి బోనాలతోపాటు కొందరు ఒడిబియ్యం, బెల్లం సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు కోటలోనే వంటలు చేసుకొని భోజనం చేశారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, యువత స్టెప్పులతో గోల్కొండ మార్మోగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు.