అమ్మకానికి పోలేపల్లి రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు.. ఖమ్మంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మంచి ఛాన్స్ !

అమ్మకానికి పోలేపల్లి రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు.. ఖమ్మంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మంచి ఛాన్స్ !
  • ప్రభుత్వ ఉద్యోగులు, సంఘాలు, బిల్డర్లతో ఆఫీసర్ల వరుస మీటింగ్ లు
  • రూ.2 లక్షలతో రిజిస్టర్​ చేసుకోవాలని సూచన
  • లాటరీ పద్ధతిలో రిజిస్టర్ చేసుకున్నోళ్లకు ఫ్లాట్ల కేటాయింపు
  • రూ.87.41 కోట్లకు ఒకే మొత్తంలో టౌన్​ షిప్​ అమ్మకం
  • తాజాగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులతో ఖమ్మం కలెక్టర్ సమావేశం

ఖమ్మం, వెలుగు: ఖమ్మంలోని పోలేపల్లిలో అసంపూర్తిగా  ఉన్న రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్లు (జలజ టౌన్​ షిప్​) అమ్మేందుకు జిల్లా అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సహకార సంఘాలు, ఉద్యోగ సంఘాలు, బిల్డర్లు, డెవలపర్లు, జాయింట్ వెంచర్లు.. ఇలా గ్రూప్​ హౌసింగ్ పథకాలపై ఆసక్తి ఉన్న వారితో వరుస మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. టౌన్​ షిప్​ ఆవరణలో ఇంతకు ముందే ఒకసారి సమావేశాన్ని నిర్వహించగా, సోమవారం వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులతో ఖమ్మం కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి, రాజీవ్ స్వగృహ సీఈ భాస్కర్​ రెడ్డి సమావేశమయ్యారు.

ఆసక్తి ఉన్న ఉద్యోగులు రూ.2 లక్షల చొప్పున చెల్లించి రిజిస్టర్​ చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 8న లాటరీ విధానంలో ఫ్లాట్లను కేటాయించనున్నారని చెప్పారు. ఈ అపార్ట్ మెంట్ల వేలం కోసం జులై 22న ప్రభుత్వం నోటిఫికేషన్​ ను విడుదల చేసింది. కరుణగిరి నుంచి అపార్ట్ మెంట్లకు వెళ్లే  రోడ్డును 60 ఫీట్ల వెడల్పు చేసి కొత్త రోడ్డును నిర్మిస్తున్నారు. 

9.22 ఎకరాల్లో 9 అంతస్తులతో 8 టవర్లు..
ఉమ్మడి రాష్ట్రంలో 2007లో జలజ టౌన్​ షిప్​ గేటెడ్ కమ్యూనిటీగా 9.22 ఎకరాల్లో 9 అంతస్తులతో 8 టవర్లు నిర్మించారు. 8 టవర్స్ లో ఉన్న మొత్తం 576 ఫ్లాట్లను ఒకే యూనిట్ గా అమ్మేందుకు నోటిఫికేషన్​ ను రిలీజ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న ఈ నిర్మాణాలను ఉన్నది ఉన్నట్టుగానే అమ్మాలని నిర్ణయించారు. ఎస్​ఎఫ్​టీ ధరను ప్రభుత్వం రూ.1150గా, మొత్తం ప్రాజెక్టు ధర రూ.87.41 కోట్లుగా డిసైడ్ చేశారు. ఎ బ్లాక్​ లో నాలుగు టవర్లు ఉండగా ఇందులో 1452, 1569 స్క్వేర్​ ఫీట్ల సైజులో 288 త్రిబుల్ బెడ్రూమ్​ ఫ్లాట్లున్నాయి.

బీ బ్లాక్లోని నాలుగు టవర్లలో 1127, 1251 స్క్వేర్​ ఫీట్ల సైజులో 288 డబుల్ బెడ్రూమ్​ ఫ్లాట్లు నిర్మించారు. పోలేపల్లిలో మున్నేరు నదికి సమీపంలో రూ.60 కోట్లతో ఈ టవర్ల నిర్మాణాలు చేపట్టగా, ఆ తర్వాత పలు కారణాలతో అసంపూర్తిగా  నిర్మాణాలు ఆగిపోయాయి. కరెంటు, నీటి పైప్​ లైన్లు సహా పెండింగ్ ఇంటీరియర్​ పనులన్నీ కొనుక్కున్న వాళ్లే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. 2020లో వేలం ద్వారా బీఆర్ఎస్ హయాంలో అమ్మేందుకు ప్రయత్నాలు చేసినా, కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. 

2022 మార్చి 24న ఆన్​ లైన్​ లో టవర్ల వారీగా అమ్మేందుకు వేలం నిర్వహించగా, కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అమ్మకానికి ప్రభుత్వం ప్లాన్​ చేసి ప్రయత్నాలు చేస్తోంది. గతంలో బీఆర్ఎస్​ హయాంలో రూ.2500కు పైగా స్క్వేర్ ఫీట్ చొప్పున ధరను నిర్ణయించగా, ఈ రేటును ఇప్పుడు రూ.1150 చొప్పున డిసైడ్ చేశారు. ఆసక్తి ఉన్న వాళ్లు యూనిట్ మొత్తంగా కొనేందుకు సెప్టెంబర్​ 6వ తేదీలోగా రూ.5 కోట్లు డీడీ తీయాలి. ఎక్కువ మంది పోటీకి వస్తే సెప్టెంబర్​ 8న జలజ టౌన్​ షిప్​ లోనే లాటరీ తీయనున్నారు. ఈ మొత్తం డీడీ తీసేందుకు గాను ఈనెల 30లోగా ప్రభుత్వ ఉద్యోగులు రూ.2 లక్షల చొప్పున చెల్లించి రిజిస్టర్​ చేసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు సూచిస్తున్నారు. 

రూ.2 లక్షలు చెల్లించి పేరు రిజిస్టర్ చేసుకోవాలి
రాజీవ్ స్వగృహ జలజ టౌన్ షిప్ లో ఫ్లాట్ కొరకు ఆసక్తి ఉన్న ఉద్యోగులు ఈనెల 30 లోపు రూ.2 లక్షలు చెల్లించి పేరు రిజిస్టర్ చేసుకోవాలి. 8 టవర్లలో అసంపూర్తిగా ఉన్న 576 ఫ్లాట్లను స్క్వేర్​ ఫీట్ రూ.1150 చొప్పున ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్నేరు రివర్ వ్యూ తో టవర్స్ బాగా ఉన్నాయి. ఖమ్మం నగరంలో అభివృద్ధి త్వరగా జరిగే ప్రాంతంలో ఈ టవర్లున్నాయి. ఖమ్మం, దేవరపల్లి జాతీయ రహదారి వల్ల రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది. మున్నేరు నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణంతో వరద ముంపు కూడా ఉండదు. జలజ టౌన్ షిప్ కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. సొంత ఇళ్ళు కావాలని ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ లాటరీలో పాల్గొని తమ కలను నెరవేర్చుకోవాలి.

అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం కలెక్టర్​ 

ప్రభుత్వ ఉద్యోగులకు ఇది మంచి అవకాశం
హౌస్​ బిల్డింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూములు ఇవ్వవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల దృష్ట్యా, ఉద్యోగస్తుల సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం జలజ టౌన్ షిప్ లో ఫ్లాట్ కొనుక్కోవడం మంచి అవకాశం. ఇప్పటి వరకు 76 మంది ఉద్యోగులు రూ.2 లక్షల చొప్పున చెల్లించి రిజిస్టర్​ చేసుకున్నారు. మిగిలిన ఇండ్ల కోసం ఆసక్తి గలవారు రూ.2 లక్షల చొప్పున చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలి. ఈ ఫ్లాట్ల కొనుగోలు కోసం ఉద్యోగులకు బ్యాంకర్లు రుణాలు అందించేందుకు కూడా సుముఖంగా ఉన్నారు. రూ.1150 చొప్పున ఎస్​ఎఫ్టీ రేటును ప్రభుత్వం నిర్ణయించింది. చదరపు గజానికి మరో రూ.1350 చెల్లిస్తే పెండింగ్ నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటు, అన్ని సౌకర్యాలతో ఉన్న కమ్యూనిటీలో ఫ్లాట్ను ఉద్యోగులకు అందిస్తాం.


కస్తాల సత్యనారాయణ, టీజీవో జిల్లా అధ్యక్షుడు