పత్తి, కందిపై రైతుల మొగ్గు

పత్తి, కందిపై రైతుల మొగ్గు
  • పత్తి, కందిపై రైతుల మొగ్గు.. వరి సాగు తగ్గింది
  • సంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ప్రత్యామ్నాయ పంటల విస్తీర్ణం
  • గతేడాది వరి 1.14 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే.. ఈసారి 38 వేల ఎకరాలే.. 
  • పత్తి లాస్ట్​ ఇయర్​ 3.61 లక్షల ఎకరాల్లో పండిస్తే.. ఈ ఏడాది 3.99 లక్షల ఎకరాల్లో సాగు 

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో ఈ వానాకాలం వరి సాగు భారీగా తగ్గగా, పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపైనే రైతులు దృష్టి పెట్టారు. పత్తితో పాటు కంది సాగు విస్తీర్ణం ఘననీయంగా పుంజుకుంది. గతేడాది పత్తి పంట 3.61 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 3.99 లక్షల ఎకరాలకు పెరిగింది. కంది సాగు అప్పుడు 88 వేల ఎకరాల్లో సాగు చేయగా, ఇప్పుడు 1.10 ఎకరాల విస్తీర్ణానికి చేరుకుంది.  వరి గతేడాది 1.14 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 38 వేల ఎకరాలకు పడిపోయింది. వినుము పంట సాగు కూడా ఈసారి భారీగా తగ్గింది.

లాస్ట్​ ఇయర్​లో 35 వేల ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి కేవలం 960 ఎకరాలకు పరిమితమైంది. వరి పంటకు కొనుగోలు సమస్య ఉండగా, మినుముల పంట చేతికొచ్చే సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం, కూలీల సమస్య ఇతర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో మినుముల పంట సాగు పడిపోయిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్​లో పత్తి, కంది, సోయాబీన్, మొక్కజొన్న ఉత్పత్తులకు బాగా డిమాండ్ పెరగడంతో రైతులు ఆయా పంటలపై దృష్టి సారించారు. మొక్కజొన్న పెసర, పొద్దుతిరుగుడు, కొర్ర, రాగి, సజ్జ, జొన్న, చెరుకు పంటల విస్తీర్ణం సాధారణంగానే ఉన్నాయి.  


అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే మార్కెటింగ్ సమస్యలు రైతులను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలను మార్కెట్​ కు తరలించే విషయమై అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది  ప్రశ్నార్థకంగా మారింది.

ఆరుతడి పంటల సాగు పెరిగింది.

వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలపై రైతులు దృష్టి పెట్టడంతో ఈసారి ఆ పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. జున్ నెలలోనే వానలు పడడంతో పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. పత్తి, కందికి మార్కెట్​లో మంచి డిమాండ్ ఉండటంతో ఈ పంటల సాగుబడి ఎక్కువగా పెరిగింది. 

- నర్సింగరావు, జిల్లా వ్యవసాయ అధికారి.