- అదనంగా అందుబాటులోకి రానున్న 416 బెడ్లు
- పీపీపీ పద్ధతిలో నిర్వహణకు నిర్ణయం
- టెండర్లు పిలవాలని టీజీఎంఎస్ఐడీసీకి ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కిడ్నీ బాధితుల డయాలసిస్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ద్వారా అదనంగా 416 డయాలసిస్ బెడ్లు, వీడియో కాలింగ్, రిపోర్ట్ షేరింగ్ తదితర సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 102 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా 15,600 మంది పేషంట్లు సేవలు పొందుతున్నారు. కొత్త కేంద్రాలు అందుబాటులోకి వస్తే మరికొంత మంది పేషంట్లకు మేలు జరగనుంది.
- సెంటర్లకు చేరుకునేలా లొకేషన్ల మ్యాపింగ్
ప్రస్తుతం కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ కోసం రాష్ట్రంలో ఏ పాయింట్ నుంచి బయలుదేరినా కేవలం 25 కిలోమీటర్ల పరిధిలోనే డయాలసిస్ సెంటర్ కు చేరుకునేలా వైద్యారోగ్య శాఖ లొకేషన్లను మ్యాపింగ్ చేసింది. మంజూరైన 79 సెంటర్లలో.. 59 కేంద్రాలను సివిల్, ఏరియా హాస్పిటల్స్ లో ఏర్పాటు చేస్తుండగా, మరో 20 సెంటర్లను ట్రైబల్, మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రద్దీ ఎక్కువగా ఉండి, 4 షిఫ్టుల్లో నడుస్తున్న 67 పాత సెంటర్లలో వెయిటింగ్ టైమ్ తగ్గించేందుకు మరో 155 కొత్త మెషిన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- ఆర్ఏహెచ్సీటీ పర్యవేక్షణ
డయాలసిస్ సెంటర్లు పబ్లిక్- ప్రైవేట్ పార్ట్ నర్ షిప్(పీపీపీ) పద్ధతిలో పని చేస్తాయి. మెషిన్లు, ఆర్‌వో ప్లాంట్లు, మందులు, సిబ్బందిని సర్వీస్ ప్రొవైడర్లే ఏర్పాటు చేసి నిర్వహిస్తారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్(ఆర్ఏహెచ్సీటీ) ఈ స్కీమ్ అమలును, ఐటీ ఇంటిగ్రేషన్, క్లెయిమ్స్ మేనేజ్ మెంట్ ను పర్యవేక్షిస్తుంది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ), టీవీవీపీ కమిషనర్ ఆయా హాస్పిటల్స్ లో అవసరమైన స్థలం, మౌలిక వసతులు కల్పిస్తారు.
ఈ కొత్త సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి టెండర్లు పిలిచి, విధివిధానాల ప్రకారం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని టీజీఎంఎస్‌ఐడీసీని ప్రభుత్వం ఆదేశించింది. డయాలసిస్ పేషెంట్లకు మెరుగైన, నాణ్యమైన సేవలందించడమే లక్ష్యమని హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు పేర్కొన్నారు.

