హైదరాబాద్ సిటీలో కొత్తగా ఇల్లు కడుతున్నోళ్లకు గుడ్ న్యూస్

హైదరాబాద్ సిటీలో కొత్తగా ఇల్లు కడుతున్నోళ్లకు గుడ్ న్యూస్
  • ఔటర్​ చుట్టూ.. ఇసుక బజార్లు.. బుక్ చేస్తే.. 48 గంటల్లో ఇంటివద్దకు..
  • నాలుగు ప్రాంతాల్లో రీచ్లు ఏర్పాటు చేసిన టీజీఎండీసీ
  • సన్న ఇసుక టన్ను రూ.1,800, దొడ్డు ఇసుక రూ.1,600
  • రియల్టర్లు, ఇండ్ల నిర్మాణదారులకు అందించేందుకు రెడీ
  • బ్లాక్​మార్కెట్ దందాకు చెక్ పెట్టేందుకు అధికారుల నిర్ణయం

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​ సిటీలో రియల్  ​ఎస్టేట్​ పుంజుకోవడంతో బడా రియల్టర్ల బిల్డింగ్ ల నుంచి సాధారణ ప్రజలు కట్టుకునే ఇండ్ల వరకు ఇసుకను తక్కువ ధరకు, త్వరగా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బ్లాక్​మార్కెట్​లో ఇసుక ధరలు భారీగా ఉండడంతో కొందరు ప్రైవేట్ వ్యాపారులు టన్నుకు రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు అమ్ముతున్నారు. ఇలాంటి దందాకు చెక్ పెట్టేందుకు తాజాగా తెలంగాణ గనుల అభివృద్ధి సంస్థ(టీజీఎండీసీ) ‘ఇసుక బజార్​’లను ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా నిర్మాణదారులు, సామాన్య ప్రజల నిర్మాణాలకు ఇసుకను తక్కువ ధరకు అందించేందుకు వీలుగా వీటికి అందుబాటులోకి తెచ్చింది. ఇసుక కావాలనుకునేవారు ఫోన్​చేస్తే 48 గంటల్లోనే సరఫరా చేస్తోంది. 

15  రోజుల కింద షురూ..
ఇసుక దళారులకు చెక్ ​పెట్టేందుకు టీజీఎండీసీ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందుకు 15 రోజుల కింద ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) చుట్టూ నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించింది. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం 1,78,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.  సన్న ఇసుక రూ.1,800(మెట్రిక్ టన్ను), దొడ్డు ఇసుక రూ.1,600 ( మెట్రిక్ టన్ను) ధరను నిర్ణయించారు. దీంతో బిల్డర్లు, ప్రజలు కొనుగోలుకు ఎక్కువగా ఆస్తకి చూపుతున్నారు. గతంలో ఇసుకను వేరే జిల్లాల నుంచి లారీల్లో తెప్పించుకునేవారు. డిమాండ్​ను బట్టి వ్యాపారులు ధరలు కూడా పెంచేవారు. ప్రస్తుతం ఇసుకబజార్లు అందుబాటులోకి రావడంతో ప్రజలకు, బిల్డర్లకు ఇసుక ఖర్చులు తగ్గే వీలు కలిగింది.

ఔటర్ వెంట ఎక్కడెక్కడంటే..
ఔటర్​రింగ్​రోడ్​వెంట అబ్దుల్లాపూర్​మెట్, వట్టినాగులపల్లి, బౌరంపేట, ఆదిబట్లలో నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించారు. అబ్దుల్లాపూర్ మెట్ 5 ఎకరాల్లో ఏర్పాటు చేయగా సన్న ఇసుక (13,950 మెట్రిక్ టన్నులు) దొడ్డు ఇసుక (21,662 మెట్రిక్ టన్నులు) , వట్టినాగులపల్లిలోనూ 5  ఎకరాల్లో ఉండగా.. సన్న ఇసుక (19,721 మెట్రిక్ టన్నులు) దొడ్డు ఇసుక (21,000 మెట్రిక్ టన్నులు) ఉంది. బౌరంపేటలో 8.13 ఎకరాల్లో ఏర్పాటుచేయగా సన్న ఇసుక (20,736 మెట్రిక్ టన్నులు), దొడ్డు ఇసుక(18,621 మెట్రిక్ టన్నులు), ఆదిబట్లలో 5.13 ఎకరాల్లో ఉండగా.. సన్న ఇసుక (30,580 మెట్రిక్ టన్నులు), దొడ్డు ఇసుక (31,958 మెట్రిక్ టన్నులు) స్టాక్ ఉందని టీజీఎండీసీ అధికారులు తెలిపారు.

త్వరలో మరో రెండు చోట్ల ఏర్పాటు
శామీర్‌పేట్, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఇసుక బజార్లు ఏర్పాటు చేస్తామని టీజీఎండీసీ అధికారులు తెలిపారు.   ఇప్పటికే ఏర్పాటైన నాలుగు చోట్లకు ఇసుక నల్లగొండ, కొత్తగూడెం రీచ్‌ల నుంచి టీజీఎండీసీ తెస్తోంది. కస్టమర్లు టీజీఎండీసీ వెబ్‌సైట్ ద్వారా బుక్​చేసుకోవాలి. రీచ్ నుంచి వచ్చే దూరాన్ని బట్టి వెహికల్ కు అద్దె చెల్లించాలి. బుక్ చేసుకున్న 48 గంటల్లోగా ఇంటికి పంపిస్తామని అధికారులు తెలిపారు.